ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్ర వ్యూహం
అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధు ల కొరత లేదని, వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు సిఎం వెల్లడించారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంతో పాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందిచుకుని నిర్మాణాలు ప్రా రంభించాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభు త్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్, ఓఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, సిఇలు హరిరామ్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఇ.లు విష్ణు ప్రసాద్, వేణు, ఇఇ రామకృష్ణ, ఎంఎల్‌సి ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. “తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు రూ.77,777 కోట్ల ఖర్చు జరిగింది. భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం, ఆర్‌ఆర్ ప్యాకేజీల కోసం మరో రూ.22వేల కోట్ల ఖర్చు అయింది. మొత్తంగా ఇప్పటివరకు రూ.99,643 కోట్ల ఖర్చు జరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా వ్యయం జరుగుతుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు, మిషన్ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేసి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజన్సీలు కృషి చేయాలి. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, వెంటవెంటనే నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు స్పష్టం చేశారు.