ప్రజాపక్షం / హైదరాబాద్ ; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను నిధుల లేమితో నిలిచిపోయిన లెండి ప్రాజెక్టు పనులు.. ఇప్పుడు స్వరాష్ట్రంలో కూడా నిధుల సమస్య కారణంగానే ముం దుకు పోవడం లేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు నిధులు లేక ప్రభుత్వం రుణాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యత క్రమంలోనే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని సర్కార్ భావించడంతో ప్రాధాన్యత గల ప్రాజెక్టుల జాబితాలో లెండి చోటు చేసుకోలేదని సమాచారం. తెలంగాణ ఏర్పడిన అనంతరం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన పెన్‌గంగ, కాళేశ్వరం వంటి వాటిని పరుగులు పెట్టించిన సర్కార్ ఇలాంటి మరో అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి విషయంలో మాత్రం అంత దూకుడు ప్రదర్శించడం లేదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఒప్పందంతో మొదలైన లెండి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాక దాని ఫలాలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రాజెక్టు పనుల్లో కొంత కదలిక వచ్చింది. నిజానికి ప్రాజె క్టు పూర్తయితే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అప్పటి డిజైన్, ఒప్పందం ప్రకారం దా దాపు 22వేల ఎకరాలకు సాగు నీరు అందుతుం ది. ప్రాణహిత మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును చేసినట్లు లెండిలో కూడా మార్పులు చేసి అటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు మరింత ప్రయోజనం చేకూరేలా ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్నదానిపై కూడా తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్ర అధికారులతో చర్చించాలని కూడా సిఎం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించి కూడా చాలా కాలమే అవుతోంది. ఈ ఆదేశాల మేరకే గతేడాది జులై చివరి వారంలో తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో చర్చలు కూడా జరిపారు. మరో సారి చర్చలు జరిపేందుకు అధికారులు సిద్ధమయినప్పటికీ ఈ దిశగా అడుగులు ముందుకు పడలేదు. వీరి చర్చలు పూర్తయితే మంత్రుల స్థాయిలో చర్చలు జరిగి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండేది. నిధుల సమస్య కారణంగానే ఈ విషయంలో మన సర్కార్ ముందుకు పోవడం లేదని తెలిసింది. దీంతో లెండి పనులు ముందుకు సాగడం లేదు. లెండి ప్రాజెక్టు పూర్వ పరాలను పరిశరీలిస్తే… గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీరా నది తెలంగాణలో చాలా దూరం ప్రయాణిస్తోంది. మంజీరాకు చిన్న చిన్న వాగులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో ఉపనదులు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గోజెగాం, రావుల్‌గాం గ్రామాల మధ్య నుంచి వచ్చే లెండి నది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామం వద్ద తెలంగాణలో కలుస్తుంది. అక్కడి నుంచి ప్రవహించి కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది.