సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ హుజూర్‌నగర్ అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండేంది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన సిపిఐ సూర్యాపేట జిల్లా సమితి రాజకీయ శిక్షణ శిబిరంముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఎదో ఒక వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి రాజకీయంగా లబ్దిపొందేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఒక సారి త్రిబుల్ తలాక్, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. సునీతమైన అంశాలపై బిజెపి రాజకీయాలు చేస్తూ దేశ భవిష్యత్‌ను పణంగాపెట్టి రాజకీయ అవకాశాల కోసం దిగజారుతుందన్నారు. సిపిఐ బలంగా ఉన్న చోట ఎట్టిపరిస్ధితుల్లోనూ పోటీ చేస్తామన్నారు. త్యాగాలతో కూడిన కమ్యూనిస్టు పార్టీకి డబ్బుతో పనిలేదని, విలువలతో పని చేస్తుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత అన్ని పార్టీలకు తెలిసేలా ఫలితాలు వచ్చాయన్నారు. బిజెపి బలోపేతం కాకుండా అడ్డుకునేలా పనిచేసిన సిపిఐకి ప్రాధాన్యతలేదనడం తదగదన్నారు. కమ్యూనిస్టు పార్టీల పొత్తులు వాటికి ఉంటాయని, వాటి గౌరవం కోసం పోరాడుతాయని అన్నారు. ఎవ్వరికి లొంగం, ఎవ్వరికి తలొగ్గం, ప్రజల ఆదరణ కమ్యూనిస్టులకే
ఉంటుందన్నారు.
ప్రజా సంఘాలు పార్టీకి పట్టుకొమ్మలు
ప్రజా సంఘాలు పార్టీకి పట్టుకొమ్మల లాంటివని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేసేవిధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న త్యాగాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమాలకు, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, తద్వారా పార్టీ ప్రాధాన్యత అన్ని వర్గాలకు తెలుస్తుందన్నారు. బిజెపికి సొంతంగా అసలు బలమే లేదని, ప్రత్యామ్నాయ ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోవడంతో జాతీయ పార్టీలు బలహీనం కావడం బిజెపికి కలిసి వచ్చిందన్నారు. ఏది ఏమైనా బిజెపికో హటావో, దేశ్‌కో బచావో నినాదంతో సిపిఐ ముందుకు పోతున్నదన్నారు. ప్రజా సమస్యలపై ఆగస్టు 7న రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజాక్షేత్రంలో చురుకుగా పని చేయాలి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ప్రజా క్షేత్రంలో చురుకుగా పనిచేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. అన్యాయాలు, అక్రమాలను చూస్తూ కూర్చునేవారు కమ్యూనిస్టులు కారన్నారు. ఎదురించి నిలదీసి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసేవారే కమ్యూనిస్టులని, అలాంటి వారికే ప్రజల్లో మనగడ ఉంటుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన రాజకీయ శిక్షణ శిబిరంలో ఉమామహేశ్వర్‌రావు దేశంలో అమలవుతున్న హిందుత్వ ఎజెండాపై ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యల్లావుల రాములు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, రాష్ట్ర సమితి సభ్యురాలు అనంతుల మల్లీశ్వరి, కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దూళిపాళ ధనుంజయనాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిత్యం ప్రజల్లో ఉండేది కమ్యూనిస్టులే
RELATED ARTICLES