సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాపక్షం / హైదరాబాద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిసిన తరహాలోనే బిజెపికి వ్యతిరేకంగా శక్తులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కోరారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వంటి వారితో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా కలవాలని సూచించారు. మగ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌లతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కేసీఆర్ కలవడం ముఖ్య ఘటన అని, ఇటీవల వరకు బిజెపితో కలిసి ఉన్న నితీశ్‌కుమార్ తాజాగా ఆ పార్టీతో కూటమిని వీడి ఆర్‌జెడి, వామపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారని నారాయణ చెప్పారు. ఆ కూటమి నాయకులు నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లను సీఎం కేసీఆర్ కలవడం అబినందనీయమని పేర్కొన్నారు. కేవలం వారినే కాకుండా బిజెపి వ్యతిరేక శక్తులను కూడా కలవాలని, ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ డిప్యూటీ సీఎం ను బిజెపి వేధిస్తోందని, జార్ఖండ్ సీఎం ను సైతం ఎన్నికల కమిషన్, గవర్నర్‌లను అడ్డం పెట్టుకొని అనర్హత వేటు వేయించిందని విమర్శించారు. ఆ రాష్ట్రాల సీఎంలను , ఎపి సీఎం జగన్మోహన్‌రెడ్డిని కూడా కేసీఆర్ కలిసి బిజెపి వ్యతిరేక శక్తులను బలోపేతం చేయాలని సూచించారు. ఒకవైపు ఆదివాసీ రాష్ట్రపతిని చేసామని చెప్పుకుంటున్న బిజెపి,ఒక ఆదివాసీ సీఎం గొంతు కోస్తారా అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ సైతం మ్యానిఫెస్టోలో హామీలను అమలు చేయని ముఖ్యమంత్రులను ప్రాసీక్యూట్ చేయడం, పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏలపై చర్యలకు సిఫార్సు చేయడం వంటి వాటి జోలికి వెళ్ళకుండా ప్రధాని చెప్పినట్లు వింటూ రాజ్యాంగ స్వయంప్రతిపత్తిని కూడా మరిచి పావులాగా మారడం దుర్మార్గమన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డ దారులు తొక్కుతోందని మండిపడ్డారు. మొన్నటి వరకు కేసీఆర్ జోలికి రాని కేంద్ర ప్రభుత్వం ఆయన గట్టిగా నిలదీస్తుండడంతో సిబిఐ, ఈడి, ఐటి వంటి వాటితో దాడికి ప్రయత్నించడం శోచనీయమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి వ్యక్తిని సినీనటుడు జూనియర్ ఎన్‌టిఆర్ భేటీ కావడం సమంజసం కాదన్నారు. ఆయన తాత సీనియర్ ఎన్‌టిఆర్, తండ్రి హరికృష్ణ ఇలాంటి వారిని కనీసం దగ్గరకు రానిచ్చేవారు కాదని నారాయణ అన్నారు.
అదానీకి దోచిపెడుతున్నారు
ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానం పొందారని, కేంద్ర ప్రభుత్వమే ఆయనకు దేశమంతా దోచేసి పెడుతుండడంతో అంత సంపద వచ్చిందని నారాయణ విమర్శించారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్ అని, ఇప్పుడు కూడా ఆయన తన ముండ్రా పోర్టు నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా కృష్ణపట్నం పోర్టు, బొంబాయి ఎయిర్‌పోర్ట్‌లను ప్రభుత్వమే ఇతరుల నుండి లాక్కొని అదానీకి కట్టబెట్టిందన్నారు. అక్టోబర్ 14- తేదీలలో విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ సమావేశంలో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జాతీయ స్థాయిలో విధానాన్ని ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తి : చాడ
ఈ నెల 4- నుంచి 7వ తేదీ వరకు శంషాబాద్‌లో జరిగే సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 33 జిల్లా మహాసభలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్ర మహాసభలో భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తామన్నారు. తెలంగాణలో బిజెపి ఆటలు సాగనీయబోమని, ఇప్పటికే ఆ పార్టీ ఓటమి లక్ష్యంగా మునుగోడులో టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించామని పునరుద్ఘాటించారు. విభజన హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయని బిజెపికి రాష్ట్రంలో పుట్టగతులు ఉండబోవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇళ్ళ సమస్యను పరిష్కరించాలని , జిఒ 58 ద్వారా నిరుపేదల ఇళ్ళ స్థలాలను త్వరితగతిన క్రమబద్ధీకరించాలని, పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలు రావణకాష్టంగా రగులుతున్నాయని, వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. హాస్టల్ కాంట్రాక్టర్‌ను మార్చాలని, పూర్తిస్థాయి విసిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ జనాభా లెక్కల సందర్భంగా ఓబిసి లెక్కలను తీయాలని డిమాండ్ చేశారు.
నితీశ్‌ను కెసిఆర్ కలవడం శుభసూచికం
RELATED ARTICLES