మొత్తం 119 నామినేషన్లు దాఖలు
ఒక్కరోజే 109 నామినేషన్లు
ముగిసిన నామపత్రాల దాఖలు ఘట్టం
ప్రజాపక్షం/సూర్యాపేట: ఆరు నెలల క్రితం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న పసుపు రైతులతోపాటు, ఇతర ప్రజాసంఘాల నాయకులు కెసిఆర్ ప్రభుత్వం కండ్లు తెరిపించేలా తాము కూడా ఎన్నికల బరిలో నిలుబడి తమ సత్తా ఏమిటో చూపేడుతామంటూ వందల సంఖ్యలో ఎన్నికల బరిలో దిగి ఎలాంటి వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. అదే సీన్ నేడు సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో కనిపిస్తోంది. ఇక్కడ కూడా వందకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. 76 మంది అభ్యర్థులు మొత్తం 119 నామినేషన్లు దాఖలు కాగా, కేవలం చివరి రోజే 109 నామినేషన్లు నమోదు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ నుండి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుండి ఉత్తమ్ పద్మావతి, బిజెపి నుండి రామారావు, టిడిపి తరపున చావ కిరణ్మయి, సిపిఎం నుండి పారేపల్లి శేఖర్‌రావు, ఇంటి పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్లు దాఖలు చేయగా వీరితోపాటు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు, పోడుభూముల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేందుకు పలువురు రైతులు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసేందుకు పలువురు సర్పంచ్ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. వీరే కాకుండా ఇంకొంత మంది ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపఎన్నికల బరిలో నిలిచేందుకు తమ నామినేషన్లను దాఖలు చేశారు.