టిఆర్‌ఎస్, బిజెపిలను ఓడించే అభ్యర్థులకే సహకారం
కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న గులాబీ పార్టీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో సిపిఐ, సిపిఐ(ఎం) కలిసి పోటీ చేయడంపై ప్రజల్లో సానుకూల సంకేతాలు వెళ్లాయ ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వామపక్షాలు పోటీ చేస్తున్న నాలుగు స్థానాలు మినహా ఇతర చోట్ల టిఆర్‌ఎస్, బిజెపిని ఓడించే అభ్యర్థులకే మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. మఖ్దూంభన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యుర్థులకు మద్దతు ప్రకటించామని, చేవేళ్ల, సికింద్రాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు తమ మద్దతు కోసం సంప్రదించారని, మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు సిపిఐ మద్దతు కోరుతున్నారన్నారు. స్థానిక పరిస్థితులకనుగుణంగా టిఆర్‌ఎస్, బిజెపిలను ఓడించగలిగే బలమైన అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించామని, అందుకు అనుగుణంగా పార్టీ జిల్లా కమిటీలు స్థానికంగానే నిర్ణయం తీసుకుంటాయని చాడ స్పష్టం చేశారు. నిజామాబాద్ స్థానంలో 175 మంది రైతులు పోటీ చేస్తున్న అంశం చర్చనీయాంశం అయిందని, పోటీ చేస్తున్న రైతులందరు కలిసి వారిలో ఒకరిని ఎన్నికల్లో గెలిపించుకోడానికి నిర్ణయిస్తే సిపిఐ పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ ఎన్నికల ప్రచారానికి ఇక మూడే రోజులు మిగిలిందన్నారు. తెలంగాణ లో కెసిఆర్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుని జాతీయ రాజకీయాల వేడి నుండి బయపటడ్డారని మూడు ఎంఎల్‌సి స్థానాల్లో ఓటమి పొందడం ద్వారా కుడిదిలో పడ్డ ఎలుకలాగా కెసిఆర్ పరిస్థితి తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను పార్టీలో చేర్చుకుని ఎలాగైనా 16 ఎంపి స్థానాలు కైవసం చేసుకోవాలని తపనపడుతున్నాడని ఆయన ఆరోపించారు. అభివృద్ది కోసం ఇతర పార్టీల ఎంఎల్‌ఎలు తమ పార్టీలో చేరుతున్నారనేది వాస్తవం కాదని, టిఆర్‌ఎస్ ప్రలోభపెట్టి వారిని పార్టీలో చేర్చుకుంటోందని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మాండవ వెంకటేశ్వరరావు ఇంటికి కెసిఆర్ ఎందుకు వెళ్ళారని, ఆయనను ప్రలోభ పెట్టేందుకు కాదా అని చాడ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రలోభాలకు గరిచేస్తే కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరిచే పటిష్టమైన నాయకత్వం లేకపోవ డం కూడా ఫిరాయింపులకు కారణమన్నారు.