కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు
185 మంది అభ్యర్థుల పోటీపై వీడిన సందిగ్ధత
ప్రజాపక్షం / హైదరాబాద్: పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖ లు చేసిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలా? లేక ఎం3 ఇవిఎం మిషన్లను వినియోగించి నిర్వహించుకోవాలా? అన్న సందేహాలకు తెర పడింది. ఇవిఎంలతోనే ఎన్నికలను నిర్వహించాలని, అయితే 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నందున ఎం3 ఇవిఎంలనే వాడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల తర్వాత 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఇక బ్యాలెట్ పత్రాలే శరణ్యమని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవిఎంలతోనే ఎన్నికల నిర్వహణకు సిఇసి మొగ్గు చూపడం విశేషం. “నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక కోసం ఎం3 ఇవిఎంలతోనే ఎన్నిక నిర్వహించుకోండి. ఇందు కోసం అవసరమైన మొత్తం 26,820 బ్యాలెట్ యూనిట్లను, 2,240 కంట్రోల్ యూనిట్లను, 2,600 వివిప్యాట్‌లను తెలంగాణకు సరఫరా చేయాలని ఇసిఐఎల్‌ను ఆదేశించాం” అని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారికి తెలియజేసింది. ఇదిలా ఉండగా అధికార టిఆర్‌ఎస్ వర్గాలు ఇవిఎంల ద్వారానే నిర్వహింపజేయాలని భావించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని, అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి అభ్యర్థించినట్లు వార్తలు వచ్చాయి. పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో టిఆర్‌ఎస్ చేస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ నిజామాబాద్ రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయడంతో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక దేశ రాజకీయాలను ఆకర్షిస్తోంది. బ్యాలెట్‌కే వెళ్తే చాలా సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతు వచ్చారు. అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఇతరత్రా అంతా సవ్యంగా లేక పోతే కోర్టులను ఆశ్రయించే వారూ ఉన్నారని, ఇలాంటి అంశాలను గమనంలోకి తీసుకునే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.