HomeNewsBreaking Newsనిజాంసాగర్‌ను ప్రాజెక్టుకు

నిజాంసాగర్‌ను ప్రాజెక్టుకు

రైతులకు ముఖ్యమంత్రి భరోసా
తిమ్మాపూర్‌ ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు,
బాన్సువాడ నియోజకవర్గ వృద్ధికి కోట్లు
ప్రజాపక్షం / బాన్సువాడ
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పటికీ ఎండిపోకుండా పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతులకు భరోసా ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి ఆ నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిండుకుండలా ఉంచుతానని సిఎం చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ.50 కోట్లను మం జూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లను మంజూరు చేయడంతో పాటు శ్రీవారి ఆలయానికి చుట్టు ఉన్న 66 ఎకరాల భూమిని ఆలయ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎలు ఘనస్వాగతం పలికారు. తిమ్మాపూర్‌ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు సిఎం కెసిఆర్‌ హాజరయ్యారు. సభలో సిఎం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్‌ నీళ్లు కూడా ఒకటని అన్నారు. ఉద్యమంలో భాగంగా పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తన నియోజకవర్గ అవసరాల కోసం పోచారం చిన్నపిల్లాడిలా కొట్లాడుతారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైందని సిఎం కెసిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసి అందరి సహకారంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. ఇకనుంచి తెలంగాణ వనరులన్నీ తెలంగాణ ప్రజలకే చెందుతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణను ఎడారిగా మార్చకుండా పచ్చని పంటలతో కళ కళలాడాలని ఉద్దేశంతో లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని, ఇక తెలంగాణకు సాగునీటి డోకా ఉండదని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు జలకలతో నిండి ఉంటాయని ఈ సందర్భంగా సిఎం ప్రకటించారు. ఒక పెద్ద మనిషిగా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తననియోజకవర్గం అభివృద్దికి ఎప్పుడు శ్రమిస్తూ అవసరమైతే చిన్న పిల్లాడిలా తన వద్ద నిధుల కోసం కొట్లాడుతారని, నిధులను తీసుకువచ్చి తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేసుకుంటున్నారని, ఈ వయసులో సభాపతి తన నియోజకవర్గంలో పర్యటిస్తు ఒక వైపు పేదల సమస్యలు, మరోవైపు రైతుల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన నిధులు తీసుకొచ్చి అభివృద్ది సాధిస్తూ ముందంజలో ఉన్న సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఈ సందర్భంగా కెసిఆర్‌ వెల్లడించారు. రైతులకు లబ్ది చేకూరుతే రైతుల కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందడానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా మారుమూల గ్రామాలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, సమయం దొరికినప్పుడల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ జరుపుతూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని సభాపతిని ఈ సందర్భంగా అభినందించారు. ఇటీవల బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయస్థాయి అవార్డు వచ్చిందని, దీనికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన కృషి ఎనలేనిదన్నారు. బాన్సువాడ ప్రజలకు సేవచేయాలంటే తనతో పాటు నాతోపాటు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉండాలన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తిరుమల దేవస్థానం ఏర్పాటు సిఎం కెసిఆర్‌ కృషి ఫలితమేనని సిఎంను ఈ సందర్బంగా అభినందించారు. కోరిన వెంటనే ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.23 కోట్లను మంజూరు చేయడం వల్ల ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నామని స్పీకర్‌ వెల్లడించారు. సిఎం కెసిఆర్‌ దంపతులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు శాలువాతో సన్మానించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద రెండుపంటలు పండించుకునేందుకు సాగునీటి డోకా లేకుండాచేసిన ఘనత మన సిఎంకే దక్కిందని సభాపతి వెల్లడించారు. నిజాంసాగర్‌ నీళ్లు అందని ప్రాంతమైన సిద్దాపూర్‌, చందూర్‌, జాకోరా ప్రాంతాలకు నీటిని అందించడానికి నిధులు కావాలని కోరిన వెంటనే సిద్దపూర్‌ రిజర్వాయర్‌ 150 కోట్లు, జాకోర ఎత్తిపోతల పథకానికి 120 కోట్లు సిఎం కెసిఆర్‌ మంజూరు చేశారని, పనులు చురుకుగా సాగుతున్నాయని సభాపతి గుర్తుచేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి సాగునీటి పథకాల కోసమే సిఎం 1200 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన నిళుల ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి ఏటా రెండు పంటలు పండించుకుంటూ రూ.1500 కోట్ల విలువైన పంటను పండిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని సభాపతి ఈ సందర్భంగా వెల్లడించారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఈ సందర్బంగా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, టిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంపి బి.బి.పాటిల్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి, ఎంఎల్‌ఎలు బిగాల గణేశ్‌ గుప్తా, సురేందర్‌, హనుమంత్‌ షిండే, గంప గోవర్దన్‌, ఎంఎల్‌సిలు గంగాధర్‌ గౌడ్‌, నర్సారెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా పరిషత్‌ల ఛైర్మన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదర్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్‌పి బండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments