సరిహద్దు ఘర్షణపై కేంద్ర ప్రభుత్వంపై వివిధ పార్టీ నేతల ఫైర్
సార్వభౌమాధికారంపై వెనుకడుగు వేయొద్దు
కలిసికట్టుగా పోరాడుదాం
అఖిలపక్ష భేటీలో రాజకీయ పార్టీల నేతలు
చొరబడితే సహించం, శాంతి కోరుకుంటున్నాం : మోడీ
న్యూఢిల్లీ : చైనా, భారత్ సైనికుల మధ్య సరిహద్దు ప్రాంతంలోని గల్వన్‌లోయ వద్ద జరిగిన ఘర్షణపై దేశంలోని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడొద్దని ప్రభుత్వానికి సూచించాయి. ఈ విషయంలో అన్ని పార్టీలూ ప్రభుత్వం వెంటే వుంటాయని ముక్తకంఠంతో ప్రకటించాయి. కాకపోతే గల్వన్‌లోయ ఘటన జరగడానికి ప్రభుత్వ నిఘా వైఫల్యమే కారణమని దుమ్మెత్తిపోశాయి. దేశ ఇంటలిజెన్స్ వర్గా లు వైఫల్యం చెందడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించాయి. ఇకముదైనా ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరాయి. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్, టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, జెడియు నాయకులు నితీష్‌కుమార్, డిఎంకె అధ్యక్షులు ఎం.కె.స్టాలిన్, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తదితరులు ఈ సమావేశానికి హాజరైన వారిలో వున్నారు. ప్రభుత్వం పెద్ద పార్టీలన్నింటినీ ఈ సమావేశానికి పిలిచింది. అయితే తమను ఆహ్వానించలేదని ఆర్‌జెడి, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎఐఎంఐఎంలు ప్రకటించాయి. ముందుగా గల్వన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికులకు మౌనం, వందన సమర్పణలతో నివాళి అర్పించారు. మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్‌లు సరిహద్దు పరిస్థితులపై వివరణ ఇచ్చారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, ఇకముందు కూడా అలాంటి దుస్సాహసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చైనా సైనికుల ఘర్షణ పట్ల యావద్దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతో ఆగ్రహం చెందుతున్నారని అన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, స్నేహాన్ని కోరుకుంటున్నదని, అయితే అన్నింటికీ మించి సార్వభౌమత్వమే మహోన్నతమైనదని, దానికి భంగం కలిగితే సహించేది లేదని ప్రకటించారు. దేశాన్ని రక్షించడానికి భారత సైన్యం చేయాల్సిందంతా చేస్తున్నదని, మోహరింపు, చర్య, ప్రతిచర్యల విషయంలో సైన్యం ప్రదర్శించిన ధైర్యం అమోఘమని అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ సామర్ధ్యాన్ని పెంచామని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘దేశ ప్రజలు యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుంది అని.. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన అసలు స్థానానికి తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి హామీని కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇప్పటికి కూడా ఈ సంక్షోభం గురించి తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశం గురించి సోనియా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘లడఖ్‌లోని మన భూభాగంలోకి చైనా దళాలు ఏ తేదీన చొరబడ్డాయి? చైనా మన భూభాగంలోకి చేసిన అతిక్రమణలను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది. మే 5 న లేదా అంతకుముందుగానా? భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రభుత్వం స్వీకరించలేదా?’ అని సోనియా వరుస ప్రశ్నలు సంధించారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎల్‌ఎసి వెంట చోటు చేసుకుంటున్న అసాధారణమైన కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి నివేదించలేదా? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎల్‌ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు చొరబడటం, భారీగా బలగాలను మోహరించడం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వం అభిప్రాయంలో ఏదైనా వైఫల్యం ఉందా?’ అని సోనియా ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉందన్నారు.
ఆప్‌కు అందని ఆహ్వానం
మోడీ అఖిలపక్ష సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందిస్తూ, ‘మా పార్టీ.. దేశం, సైనిక బలగాల తరపున నిలబడుతుంది. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. అయితే ఈ కీలక సమావేశానికి ఆహ్వానం లభించలేదు. గాల్వన్ లోయ సంఘటన తర్వాత కేజ్రీవాల్ ‘ఎల్‌ఏసీలో మా వీర సైనికులు మృతి చెందారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఈ విషాద సమయంలో మేమంతా అమర జవాన్ల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. ఈ త్యాగానికి మేం వందనం చేస్తున్నాం’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అసదుద్దీన్ అసంతృప్తి
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఏఐఎంఐఎంను ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని పిలవకపోవడం నిరాశకు గురిచేసిందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కీలక భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ ఏకాభిప్రాయం, సమిష్టి స్పందన అవసరం కాగా ఈ సమావేశానికి ఏఐఎంఐఎంను పిలవకపోవడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ చిన్న రాజకీయ పార్టీయే అయినా ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై మాట్లాడిన తొలి కొద్ది మంది ఎంపీల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. విదేశీ సైన్యం సరిహద్దులు దాటి దేశ భూభాగాన్ని ఆక్రమించడం జాతీయ సవాల్ అని, అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటేనే ఈ సవాల్‌ను అధిగమించగలమని ఓవైసీ అన్నారు.