న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధ్వంస నిరోధక తనిఖీలు, వాహన పత్రాల ధ్రువీకరణ కార్యక్రమాలతో పాటు గస్తీ తిరుగుతున్నారు. మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబు నిర్వీర్య బృందాలు డాగ్ స్కాడ్‌తో కలిసి విధ్వంస నిరోధక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హోటళ్లు, లడ్జీల్లోనూ సోదాలు చేస్తున్నామన్నారు. హోటళ్లు, లాడ్జీలతో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయా సిబ్బందికి సూచించామన్నారు. మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్, నివాసితుల వెల్ఫేర్ అసోసియేషన్లతో అసిస్టెంట్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భద్రతా చర్యల గురించి వారికి వివరిస్తున్నారన్నారు. అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సమాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఉగ్రవ్యతిరేక చర్యలకు సన్నద్ధమవుతూ అనేక జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులకు లక్ష్యంగా మారిన ఢిల్లీలో ఇతర భద్రతా సంస్థలతో కలిసి ఉగ్ర వ్యతిరేక చర్యలను తీవ్రతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోతిచేష్టలు చేసేవారు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో అదనపు భద్రతను కూడా ఈ ఏడాది మోహరించామన్నారు. ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాలే కాకుండా అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు జరుపుతున్నామన్నారు. కాగా, ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో దాదాపు 60 నుంచి 60 వేల మంది పాల్గొనే అవకాశముంది. ఈ ఏడాది క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌లు ఇస్తున్నారు. పాస్ లేకుండా ఎవరినీ ఉత్సవాలకు అనుమతించబోమని డిప్యూటీ కమిషనర్ ప్రణవ్ టయల్ చెప్పారు. 6 వేలమంది భద్రతా సిబ్బంది, 24 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 150కిపైగా సిసిటివి కెమెరాలు, ముఖ గుర్తింపు యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
నిఘా నీడలో ఢిల్లీ గణతంత్ర దినోత్సవానికి భారీ బందోబస్తు
RELATED ARTICLES