ప్రజాపక్షం / హైదరాబాద్ తాను బిజెపిలో చేరే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ ఎంఎల్‌ఏ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా శుక్రవారం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బిజెపి ఎదుగుతుందని తాను గతంలో అన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బిజెపిలో చేరే ఆలోచన లేదు అని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రత్యామ్నాయం అవుతుందని తాను గతంలో చెప్పినట్లుగానే దుబ్బాక ఉప ఎన్నికల్లో, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపినే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. కాబట్టి తాను బిజెపి లైన్‌లోనే నిర్ణయం తీసుకోవచ్చునని అన్నారు. తనకు బిజెపి బలపడుతుందనే ఆలోచన ఉన్నదని, అది నిజం కావాలని ఉన్నదని అన్నారు. కాగా, రెండేళ్ళ క్రితమే తాను బిజెపిలో చేరనున్నట్లు మునుగోడు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత కాస్త వెనక్కి తగ్గారు. తాజాగా ఆయన తన చేరికపై స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఆయన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షుని రేసులో బలమైన పోటీదారుగా ఉండడంతో, ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.
కోమటిరెడ్డి ప్రకటనకు ఖండన
బిజెపిలో చేరుతాననని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనను టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఏగా పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్‌లను ఓడించే నైతిక బాధ్యత కోమటిరెడ్డిపై ఉన్నదన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారితో నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.
నా అడుగులు బిజెపి వైపే
RELATED ARTICLES