మొత్తం 40 గంటల పాటు ప్రశ్నల వర్షం
ఇడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహం
న్యూఢిల్లీ : ‘నేషనల్ హెరాల్డ్’ నిధుల మళ్లింపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) స్వల్ప విరామం తరవాత కాంగ్రెస్‌నాయకుడు, లోక్‌సభ సభ్యుడు రాహులగాంధీని సోమవారంనాడు తన కార్యాలయానికి పిలిపించి నాలుగోరోజు విచారణ కొనసాగించింది. ఆయనపై ప్రశ్నలు సంధించింది. దీంతో నాలుగురోజులపాటు రాహుల్‌గాం ధీ 40 గంటలపాటు ఇడి కార్యాలయంలో గడిపినట్లయింది. ఇప్పటికే మూడురోజులు ఇడి ఆయ న్ను ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టింది. రాహుల్‌గాంధీ ఉదయం 11.05 గంటలకు ఎపిజె అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇ.డి. కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సిఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ ఎస్కార్ట్ ఉంది. పోలీసులను,పాక్షిక సైనిక బలగాలను ఢిల్లీ పోలీసులు ఇడి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు.ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. రెండు గంటలసేపు ఇడి విచారణ జరిపిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటా 15 నిమిషాలకు
రాహుల్‌గాంధీ మధ్యాహ్న భోజనానికి వెళ్ళారు. మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ కేసులో రాహుల్‌గాంధీ కీలకమైన వ్యక్తి అని ఇ.డి.వర్గాలు పేర్కొన్నాయి. యంగ్ ఇండియా కంపెనీలో రాహుల్‌గాంధీ 38 శాతం వాటాతో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్నారని, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్), నేషనల్ హెరాల్డ్‌లలో ఆయన పాత్ర కీలకమైనదని ఇ.డి.వర్గాలు పేర్కొన్నాయి. ఎజెఎల్‌కు ఉన్న సొంత ఆస్తుల వివరాల గురించి కూడా ఇ.డి. రాహుల్‌గాంధీని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.కోల్‌కతా కేంద్రంగా పచేస్తున్న కంపెనీ నుండి యంగ్ ఇండియా 2011లో కోటి రూపాయలు రుణం తీసుకోడానికి కారణం ఏమిటని కూడా ఇ.డి. అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. ఈ విధంగా రుణం తీసుకోవడంలో ఏ మాత్రం హేతుబద్దత లేదని, ఎందుకు తీసుకున్నారని అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఎజెఎల్ కంపెనీలో ఉన్న ఐదువేలమంది స్వాతంత్య్ర సమరయోధుల షేర్లను 2011లో స్థాపించిన యంగ్ ఇండియా కంపెనీ ద్వారా అక్రమంగా సోనియాగాంధీ కుటుంబం స్వాధీనం చేసుకుందని బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి ఆరోపిస్తూ 2013లో దాఖలు చేసిన ప్రైవేటు క్రిమినల్ కేసు ఆధారంగా ఇ.డి. రాహుల్‌గాంధీని ప్రశ్నిస్తోంది. అయితే యంగ్ ఇండియా సంస్థ కంపెనీస్ చట్టం లోని సెక్షన్ 25 ప్రకారం ఎలాంటి లాభాపేక్ష లేని కంపెనీ అని, ఇందులో ఎలాంటి అవకతవకలూ జరగలేదని కాంగ్రెస్‌పార్టీ ఈ కేసులో మొదటినుండీ వాదిస్తోంది. 2002 నుండి 2011 వరకూ కాంగ్రెస్‌పార్టీ రూ.90 కోట్లు నేషనల్ హెరాల్డ్‌కు రుణంగా ఇచ్చిందని, ఇందులో రూ.66 కోట్లు సిబ్బంది వేనాలుగా,విఆర్‌ఎస్ పథకం కింద జర్నలిస్టులకు, సిబ్బందికి చెల్లించారని కాంగ్రెస్‌పార్టీ పేర్కొంది. 1937లో స్థాపించిన ఎజెఎల్ కంపెనీ భారీ నష్టాలు చవిచూడటంతో పత్రిక నిర్వహణ కష్టంగా మారింది. దాంతో కాంగ్రెస్‌పార్టీ రుణం సమకూర్చింది. అయితే యంగ్ ఇండియా ద్వారా కేవలం రూ.50 లక్షలు మాత్రమే ఇచ్చి రూ.90.25 కోట్లు ఎజెఎల్ నుండి స్వాధీనం చేసుకున్నారని సుబ్రమణియన్ స్వామి ఆరోపించారు. షేర్లన్నీ స్వాధీనం చేసుకున్నారని ఆయన కేసు పెట్టారు.ఎజెఎల్ సంస్థ అధీనంలో ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు కేవలం రూ.50 లక్షలు చెల్లించి రూ.90 కోట్ల అప్పుడు రద్దు చేసి అన్ని షేర్లూ స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియా కంపెనీలో రాహల్‌గాంధీ, సోనియాగాంధీ బోర్డు డైరెక్టర్లుగా ఉన్నారని, వారే ఈ హవాలా అవినీతికి కారకులని సుబ్రమణ్యస్వామి ఆరోపించడంతో ఇ.డి. దాన్ని సాకుగా తీసుకుంది. ఈ కేసులో రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు ఈనెల 13, 14, 15 తేదీలలో సుదీర్ఘంగా విచారణ జరిపారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానాలురాలేదని 16వ తేదీన కూడా విచారణకు హాజరు కావాలని ఇ.డి. ఆదేశించింది. తాను బాగా అలసిపోయానని, విశ్రాంతి కావాలని రాహుల్‌గాంధీ కోరడంతో అంగీకరించిన ఇ.డి అధికారులు తిరిగి 20వ తేదీ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. పిఎంఎల్‌ఎ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) చట్టం కింద ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. ఇ.డి.కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సోమవారంనాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించారు.ఇ.డి.కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రక్షణరంగంలో అగ్నిపథ్ పథకం అమలును మొండిగా అమలు చేస్తున్నారంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ర్టీని భ్రష్టుత్వం పట్టించేందుకే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఒడిగట్టిందని కార్యకర్తలు విమర్శించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున దాడులు చేస్తోందని నాయకులు విమర్శించారు. 2010లో స్థాపించిన యంగ్ ఇండియా కంపెనీలో రాహుల్‌గాంధీ డైరెక్టర్‌గా ఉండగా, ఏడాది తరువాత సోనియాగాంధీ కూడా ఈ కంపెనీ బోర్డు డైరెక్టరుగా చేరారు. ఈ కేసులో నిర్ణీత ప్రకారం ఆమె కూడా ఈనెల 23వ తేదీన ఇ.డి అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.