ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం
వెల్లడించిన ప్రభుత్వ సమాచారం
కేంద్ర సర్కార్‌పై మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: గత నాలుగు ఏళ్లుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన వివిధ పథకాల కింద 935 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని గ్రామీణ అభివృద్ధి విభాగాల సామాజిక ఆడిట్ యూనిట్లు కనుగొన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ద్వారా అందిన సమాచా రం మేరకు ఇందులో కేవలం 12.5 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. కాగా ఈ సమాచారం 2017 18, 2020 21 మధ్యకాలానిది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత నాలుగు ఏళ్లలో కనీసం ఒక్కసారి చొప్పుననైనా 2.65 లక్షల గ్రామ పంచాయతీల్లో సామాజిక ఆడిట్ విభాగాలు తనిఖీలు నిర్వహించాయి. ఇలా ఉంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017 18 ఏడాదికి కేంద్రం 55,659.93 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2020 నాటికి అది 1,10,355.27 కోట్లకు చేరుకుంది. కాగా ఈ పథకం కింద చేసిన మొత్తం ఖర్చు 2017 18 లో 63,649.48 కోట్లు ఉండగా, 2020 21 నాటికి అది 1,11,405.3 కోట్లకు చేరుకుంది. అయితే ఆర్థికంగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు సామాజిక తనిఖీలో ప్రధానంగా తేలింది. లంచాలు, లేని వ్యక్తుల పేరిట చెల్లింపులు జరపడం, కొనుగోలు చేసిన వస్తువులకు ఎక్కువ ధర చెల్లించినట్లు చూపించడం లాంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉపాధి హామీ పథకంలో జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి శక్తిమంతమైన ఆయుధం సామాజిక తనిఖీ. దీని ప్రాధాన్యా న్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వివరించారు. రాష్ట్రాల గ్రామీణ అభివృద్ధి విభాగాలు ఎందుకు నిధులను చాలా తక్కువ మొత్తం లో తిరిగి స్వాధీనం చేసుకున్నాయని సిన్హా అడిగారు. అయితే చాలా రాష్ట్రాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడం విచారకరం. ఉదాహరణకు, తమిళనాడులో 12,525 గ్రామపంచాయతీల్లో అత్యధికంగా 245 కోట్ల రూపాయల దుర్వినియోగం జరగగా, కేవలం 2.07 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి రాబట్టుకోగలిగారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయగా, ఇద్దరిని పూర్తిగా తొలగించారు. ఒక్కరిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 12,982 గ్రామపంచాయతీలు ఉండగా, 31,795 సామాజిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 239.31 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు తేలగా, కేవలం 4.48 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. 551 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా, 180 మందిని పూర్తిగా తొలగించారు. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. కర్నాటకలో 6,027 గ్రామపంచాయతీల్లో 173.6 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు తేలింది. ఇందులో 1.48 కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి రాబట్టుకోగలిగారు. కాగా కర్నాటకలో ఎఫ్‌ఐఆర్‌లు అసలు నమోదుచేయలేదు. ఏ ఉద్యోగినీ సస్పెండ్ చేయలేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్‌లో 12.34 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాగా, కేవలం 1,593 రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో దుర్వినియోగం అయ్యింది 2.45 కోట్లు కాగా స్వాధీనం చేసుకున్నది 14,802 రూపాయలు. గుజరాత్‌లో మాత్రం కేవలం 6,749 రూపాయలు మాత్రమే దుర్వినియోగం అయ్యాయి. జార్ఖండ్‌లో 51.29 కోట్లు దుర్వినియోగం కాగా, 1.39 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉంటే రాజస్థాన్, కేరళ, అరుణాచలప్రదేశ్, గోవా, లడఖ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో అసలు దుర్వినియోగమే జరగలేదని తెలుస్తోంది.
ఇక 2011 సామాజిక తనిఖీ నియమావళి ప్రకారం ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులపై ప్రతి గ్రామపంచాయతీలో ఆరునెలలకు ఒక్కసారైనా సామాజిక తనిఖీ జరగాలి. అయితే నిధుల దుర్వినియోగం వెల్లడైన దానికంటే కనీసం మూడు నాలుగు రెట్లు ఎక్కవగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉంటే సామాజిక తనిఖీ యూనిట్లలో సగం వరకు స్వతంత్రంగా పనిచేయలేదని, పైగా ఆడిట్ల నాణ్యత, వాటి పనితీరు కూడా మెరుగుపడాల్సి ఉందని గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి సిన్హా పేర్కొన్నారు. ఇలా ఉంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. అవినీతికి అడ్డుకట్ట వేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా పోలీస్ బలగాలలో దివ్యాంగులకు 4% కోటా పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.