HomeNewsBreaking Newsనాయిని నర్సింహారెడ్డికి ఘననివాళి

నాయిని నర్సింహారెడ్డికి ఘననివాళి

ప్రజాపక్షం/హైదరాబాద్‌
కార్మిక నేత, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో గురువారం జరిగాయి. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతిమ వీడ్కోలులో రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయినిని కడసారి చూసేందుకు వచ్చిన కార్మికులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఒక మానవతావాది, కార్మిక నేతను కోల్పోయిందని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రారంభమైన నాయిని నర్సింహారెడ్డి అంతిమయాత్ర బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12, ఫిలింనగర్‌ మీదుగా మహాప్రస్థానం వరకు కొనసాగింది. కాగా టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.టి.రామారావు, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతురామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు నాయిని నర్సింహారెడ్డి పాడెను మోశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపో లో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన గురువారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి విషమిచండంతో గడిచిన రెండు రోజులుగా పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు నాయినిని పరామర్శించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు కూడా పరామర్శించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించడంతో ఆయన భౌతికకాయాన్ని మంత్రుల నివాసానికి తీసుకొచ్చారు. దీంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు,కార్మిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో నివాళ్లు అర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కెటి.రామారావుతో పాటు మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌, వివిధ రాజకీయ పార్టీల నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌, రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహా, సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నర్సింహారావు, ఇండియన్‌ జర్నలిస్ట్‌యూనియన్‌(ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి తదితరులు భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు.
సిఎం కెసిఆర్‌ దిగ్భ్రాంతి: నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టిఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని కెసిఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిపిఐ సంతాపం : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నాయిని ఒక నిబద్ధత గల నాయకుడని, కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించే కార్మిక పక్షపాతి అని గుర్తు చేశారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్మిక వర్గం కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి అని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. నాయిని ఒక సోషలిస్టుగా తనకు తెలుసన్నారు. ఆయన మరణానికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మికలోకానికి తీరనిలోటు అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. మాజీ మంత్రిగా, పలు దఫాలు ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిగా కార్మిలోకానికి ఎనలేని సేవలను అందజేశారని గుర్తు చేశారు. జీవిత చివరి అంకంలో నాయిని నర్సింహారెడ్డికి కొంత రాజకీయ అసంతృప్తి వెంటాడిందని, అయినా నిబద్ధతగానే జీవితాన్ని ముగించారని పేర్కొన్నారు. నాయిని మరణం పట్ల ప్రగాడ సంతాపం,ఆయన కుటుంబ సభ్యులకు, కార్మికలోకానికి సానుభూతిని తెలియజేశారు. నాయిని మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. కార్మిక నాయకునిగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు నాయిని నర్సింహారెడ్డి ఎనలేని కృషి చేశారని వారు గుర్తు చేశారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
నాయిని మృతి బాధ కలిగించింది : దత్తాత్రేయ
నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. నాయిని మృతి తనకు చాలా బాధ కలిగించిందని, ఆయన గొప్ప కార్మిక నాయకుడని, కింది స్థాయి నుంచి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో తనతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే క్రమంలో సుమారు 16 నెలలుగా చంచల్‌ గూడ జైలులో ఉన్నారన్నారు.
కార్మిక నేతను కోల్పోయాం: ఉత్తమ్‌
నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నాయిని మరణం పట్ల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నాయకులు ఎం.కోదండరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాయిని నర్సింహారెడ్డి నిబద్ధత గల రాజకీయ నాయకుడని, నాయినితో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. నాయిని నర్సింహారెడ్డితో తనకు చాలా సన్నిహితం ఉన్నదని సిఎల్‌పి మాజీ నేత కె. జానారెడ్డి అన్నారు. నాయిని ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు రాజకీయంగా తాను ఎదగడానికి నాయిని కృషి మరువలేనిదని చెప్పారు. నాయిని అసలు సీసలైన తెలంగాణ వాది అని, ఆయన మృతి ప్రజలకు తీరని లోటు అని టిపిసిసి అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ తెలిపారు. అదే విధంగా నాయిని నర్సింహారెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం. కోదండరాం అన్నారు. నాయిని మృతిపట్ల తన సంతాపం, కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి హైదరాబాద్‌ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కార్మిక నాయకునిగా, ఎంఎల్‌ఎ, మంత్రి, ఎంఎల్‌సిగా ఎదిగారని కొనియాడారు. నాయిని నర్సింహారెడ్డి మరణం బాధాకరమని, తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి అని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్మిక రంగంలో నాయకునిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి,కార్మికుల సమస్యల పట్ల నిత్యం పోరాడిన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. సోషలిస్టు నాయకునిగా, ముషీరాబాద్‌ ఎంఎల్‌ఎగా, హోంశాఖ మంత్రిగా, కార్మిక నాయకునిగా నాయిని నర్సింహారెడ్డి విశేష సేవలను అందించారని బిజెపి ఒబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. దక్షిణి మధ్య రైల్వే మజ్ధూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.శంకర్‌రావు, ఎస్‌పిటి, ఎలక్ట్రికల్‌ విభాగం కార్యదర్శి బి.వి.రెడ్డి సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments