ప్రారంభానికి ముందే సీతారామ కాలువకు గండి
ప్రజాప్రతినిధులు హెచ్చరించినా మారని కాంట్రాక్టర్ల తీరు
ఏం పరిశీలించారంటూ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో నాణ్యత నవ్వుతోంది. లక్షలాది ఎకరాలకు నీరు అందించాల్సిన కాలువ.. ప్రారంభానికి ముందే అది కూడా కాంక్రీట్ చేసిన చోట తెగిపోవడం నాణ్యతలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తుంది. ‘ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు. కానీ నాణ్యతలో రాజీపడవద్దు’ అన్న ప్రజాప్రతినిధుల ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు, గుత్తేదారులు బేఖాతరు చేస్తున్నారన్న విషయం ఈ గండిపడడం ద్వారా స్పష్టమైం ది. సిఎంఒ కార్యదర్శి స్మీతాసబర్వాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పలుమార్లు పర్యటించి పలు సూచనలు చేసినా, హెచ్చరికలు చేసినా గుత్తేదారుల్లో మార్పు లేదని అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే… రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించాలని ప్రయత్నిస్తున్నది. కానీ గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రారంభానికి ముందే వర్షపు నీటికే కాలువకు గండిపడడం అది కూడా కాలువ కాంక్రీట్ చేసిన చోట గండిపడడం విమర్శలకు తావిస్తుంది. సీతారామ ప్రాజెక్టు కాలువ కిన్నెరసాని నదిని దాటించే క్రమంలో వంతెన నిర్మించారు. కిన్నెరసాని నుంచి ముర్రెడు వాగు వరకు మొత్తం కాలువకు సిమెంటుతో కాంక్రీట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువకు గండిపడింది. ఈ గండి ద్వారా వర్షపు నీరు పొలాల్లోకి వెళ్తుంది. ఇంత వరకు గండిని పరిశీలించిన దాఖలాలు లేవు. ప్రారంభానికి ముందే వర్షపు నీటికే కాంక్రీట్ ఉన్న చోట గండిపడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. సీతారామ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక దృష్టిసారించారు. సిఎంఒ అధికారులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలుమార్లు సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించి తగు సూచనలు చేయడంతో పాటు నాణ్యత విషయమై పలు హెచ్చరికలు చేశారు. అయినా క్షేత్రస్థాయి ఇంజినీరింగ్ అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కు కావడంతో నాణ్యత లోపించినట్లు తెలుస్తోంది. నాణ్యత లోపాలను సరిదిద్ది ప్రాజెక్టు పనులను సత్వరం పూర్తి చేసి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నాణ్యత నవ్వుతోంది
RELATED ARTICLES