రాజకీయ పార్టీల విరాళాలకు లెక్కలేవీ?
కార్పొరేట్ విరాళాలను నిషేధించాలి
రాజకీయేతర నిధిని ఏర్పాటు చేయడం ఉత్తమం
ప్రజాస్వామ్య వికాసానికి స్వతంత్ర మీడియా అవసరం
టియుడబ్ల్యుజె, మెఫీ సెమినార్లో వక్తలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : గతంలో రాజకీయ పార్టీల విరాళాల అంశం పారదర్శకంగా ఉండేదని, ఇప్పుడు అదొక మిస్టరీగా మారిందని ప్రెస్ అకాడమీ ఆఫ్ ఇండియా (పిసిఐ) చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు స్వతంత్ర మీడియా అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టియుడబ్ల్యుజె) రాష్ట్ర ద్వితీయ మహాసభలు సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ), టియుడబ్ల్యుజె సంయుక్త ఆధ్వర్యంలో “భారతీయ ప్రజాస్వామ్యం – ఎన్నికలు” అనే అంశంపై జరిగిన సెమినార్ ను జస్టిస్ సి.కె.ప్రసాద్ ప్రారంభించారు. మెఫీ చైర్మన్, ఐజెయు సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) చైర్మన్ ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి కీలకోపన్యాసం చేయగా, కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ మాడభూసి శ్రీధర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఐజెయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, సెక్రెటరీ జనరల్ సబీనా ఇందర్జిత్, టియుడబ్ల్యుజె అధ్యక్షలు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ వేదికపై ఆసీనులయ్యారు.
ప్రజాస్వామ్యాన్ని మించిన వ్యవస్థ లేదు : అనేక పొరపాట్లు ఎదురైనప్పటికీ ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన వ్యవస్థ ఇప్పటికీ రాలేదని జస్టిస్ ప్రసాద్ అన్నారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రజాస్వామయ్య వ్యవస్థ ఉన్నదన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడిచేందుకు రాజకీయ పార్టీలు అవసరమని, పార్టీలు నడిచేందుకు నిధులు అవసరమన్నారు. గతంలో పార్టీలు బహిరంగంగానే విరాళాలు అడిగేవని, గాంధీ మహాత్ముడు పార్టీ నడిపేందుకు నిధులు కోరుతూ అప్పట్లో నేరుగా జె.ఆర్.డి. టాటా, బిర్లా వంటి పారిశ్రామివేత్తలకు లేఖలు రాసేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పార్టీలకు, నాయకులకు విరాళాలు ఎలా వస్తాయో అంతుచిక్కని వ్యవహారంగా మారిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిబద్ధతతో కూడిన స్వతంత్ర జర్నలిజం అవసరమని, దురదృష్టవశాత్తు అది లేకుండా పోయిందని జస్టిస్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీడియా ముందు ఉన్న అతి పెద్ద సవాలు విశ్వసనీయత అని పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన మీడియా ఉండాలంటే జర్నలిస్టుల వేతనాల సమస్య లేకుండా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్ విషయంలో ప్రత్యక్షంగా నిరూపించేందుకు ఆధారాలు లేవని, ఈ విషయంలో జర్నలిస్టుల నుండే సహకారం అవసరమన్నారు.