HomeNewsBreaking Newsనాటకాలు ఆపండి

నాటకాలు ఆపండి

రైతులు పండించిన ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఐ డిమాండ్‌
లౌకిక శక్తులు ఏకతాటిపైకి రావాలని చాడ వెంకట్‌రెడ్డి పిలుపు
ప్రజాపక్షం / నర్సంపేట ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప ట నాటకాలు ఆడుతున్నాయని, రైతులు పండించిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని చెప్పి న నరేంద్రమోడీ.. నేడు కార్పొరేట్‌ వర్గాలకు ఊడిగం చేస్తున్నారన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో సిపిఐ వరంగల్‌, హన్మకొండ జిల్లాల బహిరంగసభలు గురువారం ప్రారంభమయ్యాయి. పార్టీ వరంగల్‌ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అన్నింటా ముందుకెళ్తుందని గొప్పలు చెబుతూ పెట్టుబాడిదారులకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంపై పోరాటం చేస్తున్న రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు సిపిఐ కార్యకర్తలు సైనికుల్లా ఉద్యమించాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాం గ ఉల్లంఘన, మతోన్మాదంతో భారత్‌ మరింత పేదరికంలోకి మగ్గిపోతుందని దుయ్యపట్టారు. దేశానికి ఆర్థిక వనరులు ఎన్ని ఉన్నా… పేద వర్గాలను నట్టేట ముంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తు అదానీ ,అంబానీ, టాటాల ఆస్తులను నరేంద్ర మోడీ పెంచుతున్నారని ఆరోపించారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విభిన్న సంస్కృతులు, కులాల సెక్యులరిజం, భిన్నమైన పాలన కొనసాగించాలని రాజ్యాంగాన్ని రాస్తే… నరేంద్రమోడీ వచ్చాక ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరిగాయన్నారు. దేశంలో 50 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే నరేంద్రమోడీ నూతన సాగు చట్టాలు తీసుకొచ్చి భూస్వామ్య వ్యవస్థతో రాచరిక పాలన చేయాలని సంకల్పించారన్నారు. దీన్ని వ్యతిరేకించి దేశ చరిత్రలోనే సుధీర్ఘకాలం రైతాంగ ఉద్యమాలు చేసి, దేశ రాజధానిని చుట్టుముట్టి చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారన్నారు. రైతులు పోరాడితే ఎవరూ ఆపలేరని, కార్మిక సార్వత్రిక సమ్మె సాగిందన్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు కార్మికులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతో పర్యావసనంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. మద్యం ధరలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముందని గుర్తుచేశారు. రూ.32 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిన ఎల్‌ఐసిని ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇదే నిరంకుశత్వంతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తున్నదన్నారు. ప్రజలను చైతన్యపరిచే పోరాటాలను సాగించేందుకు సన్నద్ధం, కార్యాచరణలను రూపొందించి లౌకిక శక్తులు, వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు ఏకతాటిపైకి వస్తేనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా భారత కమ్యునిస్టు పార్టీ ముందుండి పోరాటాలు చేస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకత్వమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందన్నారు. దున్నేవాడిదే భూమి అని నినాదంతో భారత కమ్యునిస్టు పార్టీ పోడు యాత్ర చేపడితే… మహబూబాబాద్‌ జిల్లాలో పోడు రైతు నాగలి పట్టినందుకు తమపై క్రిమినల్‌ కేసులు పెట్టిన ఘనత కెసిఆర్‌ సర్కార్‌కే చెల్లుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే ప్రజాపోరాటాలు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు ఎదుర్కొవడానికేనా అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
నర్సంపేటలో భారీ ర్యాలీ..
వరంగల్‌, హనుమకొండ జిల్లాల సిపిఐ మహాసభలను పురస్కరించుకొని నర్సంపేటలో కమ్యునిస్టు నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. పాకాల కూడలి నుంచి ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య ముందుండి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. కేంద్ర,రా్రష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై సిపిఐ నాయకులు నినాదాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది.
పార్టీలో చేరిక..
సుధీర్ఘకాలం పాటు భారత కమ్యునిస్టు పార్టీలో పనిచేసి టిఆర్‌ఎస్‌ పార్టీ వైపు మొగ్గుచూపి ఆ పార్టీ విధానాలు నచ్చక తిరిగి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్‌కు చెందిన ఖాసిం పార్టీలో చేరారు. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడు పోతరాజు సారయ్య, కార్యవర్గ సభ్యులు మేదునూరి జ్యోతి, తాటిపాముల వెంకట్‌రాములు, జిల్లా సహాయ కార్యదర్శి కర్ర భిక్షపతి, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి విజయసారథి, నాయకులు అక్కపల్లి రమేష్‌, గుంపెల్లి మునీశ్వర్‌, తోట చంద్రకళ, మోతె లింగారెడ్డి, వలీ ఉల్లాఖాద్రి, అశోక్‌ స్టాలీన్‌, గోవర్ధనాచారి తదితరులున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments