తప్పిన పెను ప్రమాదం..
రెండున్నర కోట్ల మేర ఆస్తి నష్టం
ప్రజాపక్షం/ నాచారం హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రబ్బరు పరిశ్రమ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదంలో రెండన్నర కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్ల వచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. విద్యుద్ఘాతం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. నాచారం పోలీస్‌లు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం.. నాచారం పారిశ్రామిక వాడ రోడ్డునెం. 8లోని సెమ్‌కాన్ రబ్బరు పరిశ్రమలో రైల్వే పట్టాల మధ్య ఉంచే రబ్బరును తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. రబ్బరు కావడంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నల్లటి దట్టమైన పోగలతో పరిశ్రమ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు రంగంలో దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఘటనా స్థలానికి జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి శంకర్ లింగం, మల్కాజిగిరి అగ్ని మాపక అధికారి మల్లేష్, నాచారం సిఐ రవికిరణ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. భయం గుప్పిట్లో కాలనీలు: నాచారం పారిశ్రామికవాడ మల్లాపూర్‌లోని కాలనీలకు ఆనుకొని ఉండటంతో వివిధ కాలనీల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. తరచూ ప్రమాదాల కారణంగా కాలనీలకు కాలుష్య ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించాలని కెఎల్‌రెడ్డినగర్ కాలనీ ప్రతినిధి ఎర్రంశెట్టి వీరస్వామి కోరారు.
నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
RELATED ARTICLES