సాగుపై పగబట్టిన పాలకులు
ఎరువుల ధరలకు రెక్కలు
అంచనాలకే పరిహారం పరిమితం!
కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వాలు
వరుస విపత్తులతో తీరని నష్టం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో
వ్యవసాయం పై ప్రకృతే కాదు పాలకులు పగబట్టినట్లుంది. గడచిన ఐదేళ్లుగా ప్రకృతి రైతాంగాన్ని అనేక రకాలుగా నష్టపరుస్తూ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంటే కష్టాలలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చేయకపోగా మరింత భారం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఒకట్రెండు సందర్బాలలో మినహా ఎక్కువ సార్లు రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగం ఒక నష్టాల కార్ఖానాలా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పాలకులు మరింత భారం మోపే పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. యావత్ దేశ రైతాంగం అకుంఠిత దీక్షతో పోరాడి నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నోటనే పలికించారు. అటు వీలు కాలేదు కాబట్టి ఇటు నుంచి నరుకుదామన్నట్లుగా దొడ్డి దారి వ్యవహారాలకు మోడీ సర్కార్ తెర లేపింది. రసాయనిక ఎరువుల ధరలను పెంచడంతో పాటు వ్యవసాయ రంగానికి ఇచ్చే పలు సబ్సిడీలను క్రమేపి కోత విధిస్తూ వచ్చింది. రైతాంగం వారంతట వారుగా కార్పొరేట్లకు అప్పగించి వ్యవసాయ రంగం నుంచి వైదొలగేలా చేసేందుకు మోడీ సర్కార్ కుయుక్తులు ప్రదర్శిస్తుంది. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు నష్టపోతే మేమున్నామంటూ లక్షలాది కోట్ల ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే ప్రస్తుత మోడీ సర్కార్ వ్యవసాయానికి ఏం చేసిందో చెప్పలేని పరిస్థితి. అక్కడ మోడీ సర్కార్ ఎకరాకు రెండు వేలు వేస్తేనో, ఇక్కడ రైతుబంధు ఇస్తే రైతుకు ఉపశమనమే కానీ ఉపయోగం కాదన్న వాస్తవాన్ని వారు గుర్తెరగడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పారిశ్రామికరణ వేగవంతమైన తర్వాత కూడా దేశంలో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. గడచిన దశాబ్ద కాలంలోనే 15 శాతం మంది వ్యవసాయ రంగాన్ని వదిలి బతుకు దెరువు కోసం ప్రత్యామ్నాయ రంగాల వైపుకు మళ్లారు. మిగిలిన 65 శాతం మంది కూడా సాగు చేసే పరిస్థితి కన్పించడం లేదు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, వరదలకు తోడు ఈ మధ్య కాలంలో వైరస్‌లు, సరికొత్త తెగుళ్లు, వ్యాధులు వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రసాయనిక ఎరువులకు, క్రిమి సంహారక మందులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మిర్చి, వరి పంటలే ఇందుకు ఉదాహరణ. సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా రైతుకు ఊరట కలిగించడం లేదు. అవి నష్టాలు, కష్టాలనే మిగులుస్తున్నాయి. ఒక పరిశ్రమకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ఆదుకుంటుంది. కానీ వ్యవసాయంలో రైతుకు నష్టం వస్తే మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. సాగు పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల మాదిరే వ్యవసాయ రంగాన్ని కూడా అప్పజెప్పే కుట్రల్లో భాగమే ఇటువంటి చర్యలన్న భావన సర్వత్ర వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు రూ. 10వేల రైతుబంధు ఇచ్చి రైతులను మొత్తాన్ని కష్ట నష్టాల నుంచి గట్టేక్కించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం సాగు రైతుల్లో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఉద్దీపనలు అందడం లేదు. మారిన పరిస్థితుల్లో వరి సాగు మినహా మిగిలిన వాటన్నింటికి ముందస్తుగా కౌలు చెల్లించి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కౌలు చెల్లించిన తర్వాత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా భూ యజమానికి సంబంధం లేదు. యజమానికి మాత్రం కౌలుతో పాటు రైతుబంధు కూడా అందుతుంది. కానీ వాస్తవ సాగుదారునికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిర్చి తోటలను తొలగించాల్సిన పరిస్థితి దాపురించింది. మిర్చి సాగు చేసే రైతుల్లో 60 శాతం పైబడి కౌలు రైతులే ఉన్నారు. అటు రైతుబంధు అందక, ఇటు సాగు కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యవసాయాన్ని వదిలి మరో పని చేసుకుందామంటే ప్రత్యామ్నాయ పనులు కూడా దొరకడం లేదు. కొన్ని ప్రాంతాలలో కౌలు రైతులకు వచ్చిన వరుస నష్టాల కారణంగా కౌలుకు చేసే వారు కూడా దొరకక పొలాలు బిళ్లుగా మారుతున్నాయి. 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయం నష్టాలను మిగిలిస్తే దానిని నమ్ముకున్న వారు అప్పుల్లో కూరుకుపోతే ఈ దేశ భవిష్యత్తు ఏమిటన్నది పాలకులకు అర్థం కావడం లేదు. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు, శక్తులు తప్ప రైతాంగం పాలకుల కంటికి కన్పించడం లేదు. కార్పొరేట్ల సేవలోనే పాలక వర్గాలు తరిస్తున్నాయి. వ్యవసాయ రంగ సంక్షోభం దేశ భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ప్రతికూల సవాళ్లను విసురుతుంది. ఈ దశలో పాలకులు వ్యవసాయ రంగానికి పట్టించుకోక పోవడం, గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం, పెట్టుబడులకు అనుగుణంగా మద్ధతు ధర కల్పించలేకపోవడంతో మొత్తం వ్యవసాయ రంగం నానాటికి తీసికట్టు నానంబొట్టు అన్న సామెతలా తయారైంది. దేశంలోనే అతి పెద్ద ఉత్పత్తి రంగంగా ఉపాధి రంగంగా ఉన్న వ్యవసాయాన్ని పరిరక్షించేందుకు వ్యవసాయ పరిరక్షణోద్యమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకుల విధానాలు మారెంత వరకు పోరాటాలు నిర్వహించి వ్యవసాయ రంగంతో పాటు దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నష్టాల సాగు… కష్టాల కడలిలో రైతన్న
RELATED ARTICLES