1100 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్
నిఫ్టీ 11వేల దిగువకు
ముంబయి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఏ దశలోనూ పుంజుకోలేక నష్టాల్లోనే ముగిసింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు
భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్తల ఆందోళన ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపైనా పడింది. దేశీయంగానూ కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదం వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి ఐటీ షేర్లు… హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ వంటి బ్యాంకింగ్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. మిగిలిన రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. వరుస లాభాలను చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లూ నష్టాలను చవిచూశాయి. దీంతో వరుసగా ఆరో రోజూ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 11వేల మార్కు దిగువకు చేరింది. ఆగస్టు 4 తర్వాత నిఫ్టీ 11వేల దిగువకు చేరడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాల్లో ప్రారంభమైన మన మార్కెట్లు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. ఉదయం 37,173 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా పడుతూనే ఉంది. చివరికి సెన్సెక్స్ 1,114.82 పాయింట్లు నష్టపోయి 36,553.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 326.30 పాయింట్లు నష్టపోయి 10,805.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.89గా ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.16%), బజాజ్ ఫైనాన్స్ (6.63%), టాటా మోటార్స్ (6.54%), మహీంద్రా అండ్ మహీంద్రా (6.12%), టాటా కన్సల్టెన్సీ (5.48%) ప్రధానంగా నష్టపోయాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్, హిందుస్థాన్ షేర్లు మాత్రమే రాణించాయి.
కారణాలివే..
* అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెల్లడించడం అక్కడి మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు నిన్న రాత్రి నష్టాల్లో ముగిశాయి. అదే ప్రభావం ప్రపంచ మార్కెట్లపైనా పడింది.
* యూరప్‌లో కరోనా వైరస్ రెండో దఫా విస్తరిస్తోందన్న కారణంతో లాక్‌డౌన్ ఆంక్షలు విధించేందుకు ఆయా దేశాలు సిద్ధమవ్వడం మదుపరుల ఆందోళనకు కారణమైంది. దీంతో యూరప్ మార్కెట్లు సైతం నష్టాలు చవిచూశాయి.
* దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండడం, చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండడం మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షేర్లు తెగనమ్ముకోవడంతో గత కొన్ని రోజులుగా మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరిన్ని పతనాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.