HomeNewsBreaking Newsనష్టం అపారం…విషాదం అనంతం

నష్టం అపారం…విషాదం అనంతం

చేదు అనుభవాలు మిగిల్చిన భారీ వర్షాలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 20 మందికి పైగా మృతి
భారీ వర్షాల వల్ల పదివేల మంది నిరాశ్రయులు
రూ.1000 కోట్ల నష్టం
వరంగల్‌, హనుమకొండలోనే నష్టం రూ.500కోట్లు
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
గడిచిన వారం రోజులుగా వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం అంతులేని విషాదాన్ని నింపింది. ముందెన్నడూ చూడని భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి జిల్లాలో 20 మందికి పైగా ప్రజలు మరణించగా, వందల సంఖ్యలో మూగజీవాలు మృతి చెందగా వందలాది ఇండ్లు నేలమట్టమై మురికి కూపాలుగా తయారయ్యాయి. వరంగల్‌ నగరంతో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో మరణాలు, ఆస్థి నష్టం అధికంగా సంభవించాయి. ములుగు జిల్లాలోని ఒక్క కొండాయి గ్రామంలోనే 8 మంది జంపన్న వాగు ఉదృతికి కొట్టుకుపోయి మృతి చెందగా, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో 4గురు మృత్యువాత పడ్డారు. లెక్కలేనన్ని పశువులు, కోళ్లు, ఇతర సంపద నీటిలో కొట్టుకుపోయాయి. వందల ఇండ్లు నేలమట్టం
కాగా, రోడ్లు, బ్రిడ్జిలు, కొట్టుకపోయి, చెరువులు తెగి, వాగులు పొంగి ప్రవహించాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేటు ఆస్తులు సుమారు వెయియ కోట్ల వరకు నష్ట కలుగవచ్చునని అంచనా వేస్తున్నారు. అదికారిక లెక్కల ప్రకారం ఒక్క వరంగల్‌,హనుమకొండ జిల్లాలలోనే సుమారు 500 కోట్ల నష్టం జరిగి ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణమంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ పరంగా జరిగిన వరద నష్టం రూ.414కోట్లు అని శనివారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అంచనాలు కూడా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌, హనుమకొండ మహానగరంతో పాటు భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువులు, కుంటలు నిండి తెగిపోవడం వలన వరదలు భారీగా ముంచెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరదలు ముంచెత్తినప్పుడు ముంపు గురయ్యే ప్రాంతాలను గుర్తించి వారికి అక్కడి నుంచి కాలి చేయించి వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లతో రక్షించుకోవడం జరిగింది.
భారీ వర్షాల వల్ల పదివేల మంది నిరాశ్రయులు
వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల మంది భారీ వర్షాల వల్ల నిరాశ్రయులు అయ్యారు. అత్యధికంగా వరంగల్‌,హనుమకొండ,ములుగు,భూపాలపల్లి జిల్లాలలోనే నిరాశ్రయులు అయ్యారు. ఒక్క వరంగల్‌ జిల్లా వ్యాప్తంగానే 946మందిని వరదల్లో చిక్కుకున్న వారికి ప్రాణనష్టం జరగకుండా కాపాడటం జరిగింది. వరంగల్‌ జిల్లాలో రూ.89కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా రాగా హనుమకొండ జిల్లాలో రూ.146కోట్లు, వరంగల్‌ మున్సిపల్‌ మహానగరంలో రూ.179కోట్లు నష్టం వచ్చినట్లు అంచనా వేయడం జరిగింది. వరదల్లో 36 పునరావాస కేంద్రాల ద్వారా 4వేల668మందికి సహాయం చేయడం జరిగింది. 38 రెస్క్యూ టీం ల ద్వారా 2055మందిని రక్షించడం జరిగింది. 207 ఇండ్లు పూర్తిగా దెబ్బతినడం, 480 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించడం జరిగిందని చెప్పారు. 920ముంపు ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలను చేపట్టారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుండి రోడ్లు, పంటలు, ఇండ్ల నష్టాలపై జిల్లాల వారిగా ప్రాథమిక అంచనాలు అందాయని వాటిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఏమైన హెచ్చుతగ్గులు ఉంటే ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేసి అన్ని పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు.
గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోనే భారీ నష్టం
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కురిసిన భారీ వర్షాల వలన 154ప్రాంతాలు జలమయయ్యాయి. వాటిలో 18ప్రాంతాలు నీటిలో మునగగా 43సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. 38బీటీ రోడ్లు కొట్టుకుపోయాయి. రెండింటికి రూ.83కోట్ల78లక్షల నష్టం అంచనా వేశారు. మెటల్‌ రోడ్డు 95కిలోమీటర్లు దెబ్బతింటే రూ.23కోట్ల5లక్షల నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. నాలాలు, డ్రైనేజీలు 68కిలోమీటర్లకు రూ.33కోట్ల48లక్షలు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతింటే రూ.17.79కోట్లు, నీటి సరఫరా పైపులైన్లు 34కిలోమీటర్లు నష్టపోతే రూ.19.90కోట్లు, విద్యుత్‌ స్తంభాలు 1789 విరిగిపోయి ధ్వంసమైతే రూ.1.62కోట్లు అంచనా వేశారు. వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో 13మండలాల్లో 192గ్రామాల్లో భారీ వర్షం ప్రభావం పడింది. ఒకరు చనిపోగా ఆరు పశువులు మృతి చెందాయి. 37చెరువులు దెబ్బతినగా రూ.2కోట్ల 64లక్షల నష్టం జరిగింది. ఆర్‌అండ్‌బీ రోడ్లు 22.6కిలోమీటర్లు దెబ్బతినగా రూ.17కోట్ల నష్టం అంచనా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పీఆర్‌ రోడ్లు 113.20కిలోమీటర్లు దెబ్బతింటే రూ.39.14కోట్ల అంచనా వేశారు. 99ఆవాసాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ ధ్వంసమయ్యాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు 44 కొట్టుకుపోగా రూ.26కోట్ల నష్టం వచ్చింది. విద్యుత్‌ స్తంభాలు 425ధ్వంసం కాగా రూ.2కోట్ల పది లక్షలు నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments