కులమతాలకతీతంగా అందరినీ సమంగా చూడండి
ఎన్‌డిఎ ఎంపిలకు మోడీ హితబోధ
ఎన్‌డిఎ పక్ష నేతగా నరేంద్రమోడీ ఏకగ్రీవ ఎన్నిక
రాష్ట్రపతితో భేటీ : ప్రభుత్వ ఏర్పాటుకు రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానం
న్యూఢిల్లీ : నవ భారత నిర్మాణానికి సరికొత్త ప్రయాణం మొదలుపెడదామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రెండోసారి ప్రధానిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయను న్న మోడీని ఎన్‌డిఎ పక్ష నేతగా ఆ కూటమికి చెందిన ఎంపిలు శనివారంనాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఎన్‌డిఎ ఎంపీల సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, ఇప్పుడిక తమ ప్రభుత్వం కొత్తశక్తితో నవభారత నిర్మాణానికి కొత్త ప్రయా ణం సాగించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మత, కులాలతోపాటు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరినీ సమభావంతో చూస్తూ పనిచేయాలని ఎంపీలకు ఆయన ఉద్బోధ చేశారు. 75 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. మైనారిటీల విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం వుం దని మోడీ చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో వారంతా ఎన్నికల సమయంలో భయభయంగా బతికారని, అందుకే మైనారిటీల్లో నమ్మకాన్ని పెంచాలని కోరారు. 1857 నాటి మొదటి స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో పనిచేయాలన్నారు. స్వాతంత్య్రం కోసం అన్ని మతాలు తాటిపైకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా సత్పరిపాలన కోసం అటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.“మైనారిటీల్లో విశ్వాసాన్ని పెంచుదాం. వారికి అండగా నిలబడదాం” అని అన్నారు. పబ్లిసిటీ కోసం మీడియాను వాడుకోవద్దని, విఐపి సంస్కృతిని విడనాడాలని కొత్త ఎంపీలకు ఆయన హితబోధ చేశారు. మంత్రిమండలి గురించి ప్రస్తావిస్తూ, వివరాలను ఎంపీలందరికీ అందజేస్తానని, మీడియా కథనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. మీడియా ఎల్లప్పుడూ మనల్ని గందరగోళపరు స్తూ, చెడు ఉద్దేశాలతో ఇరుకున పెడుతూ వుంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా బాధ్యతలను నెరవేర్చాలన్నారు. సహజంగా ఎన్నికలనేవి ప్రజలను విభజిస్తూ, వారి మధ్య అగాధాన్ని సృష్టిస్తాయని, కానీ ఈసారి 2019 ఎన్నికలు మాత్రం సమాజంలోని ప్రజలందరినీ ఐక్యం చేశాయని చెప్పారు. అంటే ప్రజలు ఎన్‌డిఎపై ఎంతో నమ్మకం వుంచి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత వుంటుందని అందరూ భావించారని, కానీ అత్యంత సానుకూల ఫలితం వచ్చిందని, అధికారంలో వుంటూ ప్రజలకు సేవ చేయడం తప్ప వేరేమార్గం లేదని అన్నారు.2014 నుంచి 2019 వరకు కేవలం పేద ప్రజల కోసమే ప్రభుత్వాన్ని నడిపామని, అందుకే వారు ఈసారి మనల్ని మళ్లీ గెలిపించారని గుర్తుచేశారు. దేశాభివృద్ధి కోసం ఎన్‌డిఎ పనిచేస్తుందని నమ్మకాన్ని మరింత పెంచాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. జాతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ ఆశలే మన కూటమి ప్రధాన నినాదమన్నారు. ఎన్‌డిఎకు చెందిన 353 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిలో 303 మంది ఎంపీలు బిజెపికి చెందినవారు.
రాష్ట్రపతి ఆహ్వానం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ సమ్మతిని తెలియజేశారు. అలాగే ఎన్‌డిఎ ఎంపీల తీర్మానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బిజెపి వర్గాలు వెల్లడించాయి.అంతకుముందు,ఎన్‌డిఎ సమావేశం పార్లమెంటు సెంట్రల్‌హాలులో జరిగింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తమ పక్ష నేతగా మోడీ పేరును ప్రతిపాదించగా, అందుకు ఎంపీలంతా అంగీకరించారు. ముందుగా మోడీని బిజెపి పక్ష నేతగా, ఆ తర్వాత ఎన్‌డిఎ పక్ష నేతగా ఎన్నుకున్నారు. 353 మంది ఎన్‌డిఎ ఎంపీలు ఏకగ్రీవంగా మోడీని తమ నేతగా ఎన్నుకున్నట్లు అమిత్‌షా ప్రకటించారు. జెడి(యు) నేత నితీష్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్‌రే, అకాలీదళ్ అగ్రనేత ప్రకాష్‌సింగ్ బాదల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వా నీ, మురళీ మనోహర్ జోషిలు కూడా వేదికపై ఆశీనులయ్యారు. అమిత్‌షా మోడీ పేరును ప్రతిపాదించగా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీలు సమర్థించారు. ఆ తర్వాత ఎన్‌డిఎ పక్ష నేతగా ఎన్నిక లాంఛన ప్రాయమే అయింది.బాదల్ ఆయన పేరును ప్రతిపాదించగా, మిగతా ఎన్‌డిఎ పక్ష నేతలు సమర్థించారు.
నవ భారత నిర్మాణానికి సరికొత్త ప్రయాణం
RELATED ARTICLES