ఎపి సిఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్
కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎంకె అధినేత స్టాలిన్ తదితరులు హాజరు
రూ. 2250లకు పెన్షన్లు పెంచుతూ దస్త్రంపై తొలి సంతకం
ప్రజాపక్షం / విజయవాడ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్య మంత్రిగా ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి వేలాదిగా హాజరైన పార్టీ కార్యకర్తలు, ప్రజల కరతాళధ్వనుల మధ్య గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు “వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను” అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అయితే ప్రస్తుతానికి వైఎస్ జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎంకె అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెవిపి రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్, టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, వైఎస్ ఆర్ సిపి ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజర య్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం కిటకిటలాడింది. కాగా, ప్రమాణ స్వీకారానికి ముందు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, అనిల్ సభా ప్రాంగణానికి వచ్చారు. 12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ ప్రత్యేక వాహనంలో వైఎస్ జగన్ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా.. ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎంకె అధినేత స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. నూతన ముఖ్యమంత్రికి మతపెద్దలు ఆశీర్వచనాలు ఇచ్చారు.స్టాలిన్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశే క్రమంలో ఆయన ముందుగా తెలుగులో ‘అందరికీ నమస్కారం’ అంటూ ప్రజలను పలకరించిన ఆయన అనంతరం తమిళం, ఇంగ్లీషులో సైతం పలకరించారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంచి జరగాలని కోరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.