దేశ వ్యాప్త ఆందోళనలకు ఎస్‌కెఎం నిర్ణయం
వచ్చేనెల రెండో వారంలో తుది రూపమిస్తామని ప్రకటన
న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా రైతులు ‘రాజ్‌భవన్ మార్చ్’ నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) బుధవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. వచ్చేనెల 14న సమావేశపై, ఈ ఆందోళనా కార్యక్రమానికి తుది రూపం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రైతుల ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. అటవీ సంరక్షణ చట్టంలోని పలు నిబంధలను ఎస్‌కెఎం తీవ్రంగా వ్యతరేకించింది. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని, నవంబర్ 15వ తేదీన వివిధ గిరిజన సంఘాలు, సంస్థలు చేస్తున్న ఆం దోళనలకు సంఘీభావం ప్రకటించింది. నాటి వివాదాస్పద మూడు సాగు చట్టాల కు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్
తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు 2020 నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఏడాదికిపైగా సాగిన ఆ ఆందోళనల్లో 800 మందికిపైగా రైతులు మృతి చెందారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, గత ఏడాది నవంబర్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఎలాంటి చర్చ లేకుండనే మూడు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, ఎస్‌కెఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ ఆందోళన విరమించడానికి నిరాకరించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి చట్టబద్ధత కల్పించడం, ఆందోళనా కాలంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లను పరిష్కరించేవరకూ ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తే తప్ప ఉద్యమాన్ని నిలిపేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 9న రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎంఎస్పిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని మోడీ సర్కారు ప్రకటించడంతో, రైతులు ఆందోళన విరమించారు. కానీ, నాడు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. 40కిపైగా రైతు సంఘాలతో ఏర్పాటైన వేదిక ఎస్‌కెఎం నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే ఎంఎస్పి నిర్ధారణ కమిటీలో చోటు కల్పించడాన్ని అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆ కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో, మరోసారి ఉద్యమానికి ఎస్‌కెఎం సిద్ధమవుతున్నది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌కెఎం తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జార చేసింది. ఈనెల 17 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. 27న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29. పోలింగ్ నవంబర్ 12న జరుగుతుంది. కౌంటింగ్ డిసెంబర్ 8న జరుగుతుంది. ఇంతకు ముందు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్రం, ఈసారి రెండు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
నవంబర్ 26న రైతుల ‘రాజ్‌భవన్ మార్చ్’
RELATED ARTICLES