HomeNewsBreaking Newsనల్ల వస్త్రాలు ధరించిఎంపిల నిరసన ప్రదర్శన

నల్ల వస్త్రాలు ధరించిఎంపిల నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ : అదానీ వ్యవహారం, లోక్‌సభ ఎంపిగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అంశాలపై ఆందోళనల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్రా నికి వ్యతిరేకంగా పలువురు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం నల్లవస్త్రాలు ధరించి విజయ్‌చౌక్‌ నుంచి పార్లమెంట్‌ వరకు నిరసన ప్రదర్శన చేశా రు. కాంగ్రెస్‌ ఎంపి సోనియాగాంధీ, పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా పలువురు ఆందోళనకారులు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్ర హం వద్ద గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘సత్యమేవ జయతే’ అని రాసిన బ్యానర్‌, ‘సేవ్‌ డెమాక్రసీ’ అని రాసిన ప్లకార్డులను చేబూని విజయ్‌ చౌక్‌ వరకు నిరసనగా వెళ్లి అక్కడ బైఠాయించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అదానీ ఆస్తులు అంతకంతకూ ఎలా పెరిగాయని నిలదీశారు. మీరు ఎన్నిసార్లు విదేశాలకు వెళితే అన్నిసార్లు కూడా పారిశ్రామికవేత్తను ఎందుకు తీసుకువెళ్లారని ప్రధానిని ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా ఎన్ని ప్రశ్నలు సంధించినా మోడీ సమాధానం చెప్పలేకపోతున్నారని విజయ్‌ చౌక్‌ వద్ద ఖర్గే మీడియాకు చెప్పారు. అదానీ అంశంపై జెపిసి వేయాలని తాము కోరుతున్నామని, దీనికి ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదన్నారు. జెపిసి దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారన్నారు. దీని అర్థం తప్పుచేశారనే తాము భావిస్తున్నామన్నారు. అదానీ గ్రూపు కార్పొరేట్‌ మోసం, స్టాక్‌ ధరల అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు అనుమతించాలని ప్రతిపక్షాలు కోరుతున్న విషయం తెలిసిందే. కాగా, రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై కూడా ఖేర్గ ప్రస్తావించారు. రాహుల్‌పై గాంధీపై అనర్హత వేటు వేయాలనే కర్నాటకలోని కోలార్‌లో ఆయన వ్యాఖ్యలు చేస్తే వాటిపై కేసును గుజరాత్‌కు బదిలీ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలపై నేడు చీకటి రోజు అని ఖర్గే వ్యాఖ్యానించారు. మోడీ తొలుత స్వయం ప్రతిపత్తి సంస్థలను అంతం చేశారని.. ఎన్నికల్లో గెలిచినవారిని బెదిరించి ఆ స్థానంలో సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు లొంగనివారి కోసం ఇడి, సిబిఐలను రంగంలోకి దించుతున్నారని అన్నారు. ఆ విషయాన్ని ఎత్తి చూపేందుకే తామంతా నల్ల వస్త్రాలు ధరించి నిరసన చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అంటిముట్టనట్టుగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ సోమవారం నాటి ప్రతిపక్షాల నిరసనలో పాల్గొనడం గమనార్హం.
ప్రతిపక్ష ఎంపిల భేటీ
ఇదిలా ఉండగా, లోక్‌సభ, రాజ్యసభలో రాహుల్‌పై అనర్హతవేటు, అదానీ అంశంపై అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ఉదయం పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్‌, టిఎంసి, బిఆర్‌ఎస్‌, ఎస్‌పి సహా పలు పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపిలు సమావేశమయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత అయిన ఖర్గే చాంబర్‌లో డిఎంకె, సమాజ్‌వాదిపార్టీ, జెడియు, బిఆర్‌ఎస్‌, సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌జెడి, ఎన్‌సిపి, ఐయుఎంఎల్‌, ఎండిఎంకె, కేరళ కాంగ్రెస్‌, టిఎంసి, ఆర్‌ఎస్‌పి, ఆప్‌, ఎన్‌సి, శివసేన (యుబిటి) సహా ఇతర నాయకులు భేటీ అయ్యారు. బడ్జెట్‌ సమావేశాల్లో విపక్ష పార్టీల మధ్య ఏర్పడ్డ సయోధ్య.. పార్లమెంట్‌ వెలుపలా కొనసాగాలని కాంగ్రెస్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments