5 కోట్ల మంది ఎదురుచూపులు
పిఎం కిసాన్ పథకం డబ్బుల కోసం నిరీక్షణ
రైతుల ఖాతాల్లోకి చేరని నగదు
తొలి రెండు విడతల్లోనూ ఇదే పరిస్థితి
ఆర్టిఐ సమాచారంలో నిగ్గుతేలిన నిజాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం ప్రకటించిన పిఎం- కిసాన్ పథకం నీరుగారినట్లుగా కన్పిస్తోంది. ఆరంభశూరత్వంలా దూసుకొచ్చిన పథకం రైతులకు కాస్త ఊరటనిచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం ఈ పథకం కింద వచ్చే డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దేశంలో 5 కోట్ల మంది రైతులకు ఇంకా ఈ పథకం డబ్బులు వారి ఖాతాల్లో పడలేదు. మూడో విడత కింద ప్రతి రైతుకు రూ. 2000 నగదు రావాల్సివుంది. అయితే ఇంకా 5.16 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇంకా ఈ నగదు చేరలేదు. పైగా దాదాపు 2.51 కోట్ల మంది రైతులకు రెండో విడత నగదే అందలేదని తేలింది. దీంతో ఈ పథకం ఉన్నట్టుండి ఆగమ్యగోచరంగా మారిపోయింది. తొలి రెండు విడతల్లోనూ అటుఇటుగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇంకా కోట్లాది మందికి నగదు చేరనేలేదు. ఇవి ఎవరో చెప్పిన లెక్కలు కావు. ప్రతిపక్షాల ఆరోపణలు కావు. ఇవన్నీ ప్రభుత్వ లెఖ్కలే. పిటిఐ పాత్రికేయుడొకరు సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద వేసిన పిటిషన్‌కు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఇచ్చిన సమాధానంలో వెల్లడైన నిజాలివి. పిఎం-కిసాన్ పథకం కింద ఏటా ప్రతి రైతుకు రూ. 6000 నగదు అందాల్సివుంటుంది. ఇది మూడు విడతలుగా అందుతుందని కేంద్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా రూపొందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. తెలంగాణలో రైతుబంధు పథకం ఈ కోవకు చెందిందే. అయితే పిఎం-కిసాన్ పథకం కింద రైతుకు కచ్చితంగా చేరాల్సిన నగదు బదిలీ పథకమిది. 2018 డిసెంబరు నుంచి 2019 నవంబరు మధ్యకాలంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులు నమోదయ్యారు. 2018 డిసెంబరు 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రతి నాలుగు నెలలకోసారి రైతుకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరువేల రూపాయలు అందాల్సివుంది. తొలి విడత నిధుల విడుదల అట్టహాసంగా సాగింది. రైతులంతా సంతోషించారు. అంతవరకు బాగానే వుంది. ఇక రెండో విడత నుంచి కేంద్ర కోర్రీలు మొదలయ్యాయి. నిజానికి మొదటి విడత అందరికీ అందినట్లు చెపుతున్నప్పటికీ, 9 కోట్ల మంది లబ్ధిదారుల్లో 7.62 కోట్ల మందికి అంటే 84 శాతం మందికి మాత్రమే నగదు అందింది. రెండో విడత ఇంకా కష్టమైంది. 6.5 కోట్ల మంది రైతులకు మాత్రమే డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాయి. ఇక మూడో విడత మరీ దారుణంగా మారిపోయింది. ఈ విడతలో కేవలం 3.85 కోట్ల మంది రైతులకు మాత్రమే డబ్బులు అందాయి. పిటిఐ విలేకరి దాఖలు చేసిన ఆర్టిఐ పిటిషన్‌పై వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారంలో డేటాను మూడు భాగాలుగా విభజించారు.
నరేంద్ర మోడీ… మూడో విడత ఏదీ!
RELATED ARTICLES