వారణాసిలో 111 మంది తమిళ రైతుల నామినేషన్లు
తిరుచిరాపల్లి : తమిళనాడు రైతుల ఆగ్రహం చల్లారలేదు. రైతాంగ సమస్యలపై కొన్ని మాసాల పాటు దేశ రాజధానిలో తీవ్రమైన నిరసనలు చేపట్టిన తమిళనాడు రైతులు తా జాగా బ్యాలెట్ పోరుకు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో 111 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. తమిళనాడు రైతు నాయకుడు పి.అయ్యకన్ను ఈ విషయాన్ని శనివారంనాడు మీడియాకు తెలియజేశారు. వారణాసి నుంచి మోడీకి వ్యతిరేకంగా 111 మం ది రైతులు పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. అయ్యకన్ను ప్రస్తుతం జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షునిగా కూడా వున్నారు. రైతుల డిమాండ్లను మ్యానిఫెస్టోలో చేర్చాలని ఒత్తిడి చేసే క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో మోడీపై పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలన్నది తమ డిమాండ్ అని చెప్పారు. 2017వ సంవత్సరంలో తాము 100 రోజులపాటు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించామని, అయినప్పటికీ, మోడీ సర్కారులో కదలిక లేదని, రైతుల పట్ల చిన్నచూపు చూస్తూనే వుందని విమర్శించారు. రైతుల డిమాండ్లను బిజెపి మ్యానిఫెస్టోలో చేర్చినపక్షంలో వారణాసిలో నామినేషన్లు దాఖలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని తెలిపారు. అలా జరగకపోతే, పోటీ లో వుంటామని, పైగా వారణాసిలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. బిజెపి రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పారు. బిజెపితోపాటు కాంగ్రెస్ వంటి పక్షాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారా అని ప్రశ్నించగా, ప్రస్తుతానికి పాలకపక్షమైన బిజెపిపైనే తమ ఆందోళన నడుస్తున్నదని, అందుకే మోడీపై పోటీ చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వంటి పార్టీలు ఇప్పటికే రైతుల రుణమాఫీకి హామీయిచ్చాయని గుర్తుచేశారు. బిజెపికి గానీ, మోడీకి గానీ తాము వ్యతిరేకం కాదని, తమ డిమాండ్‌పై పాలకపక్షాన్ని ఒత్తిడిలోకి తీసుకురావడమే ధ్యేయమని చెప్పారు.
నరేంద్ర మోడీకి రైతుల సెగ!
RELATED ARTICLES