కొవిడ్‌తో చేరితే ఆశలు గల్లంతే
ఒక్కో దానికీ ఒక్కో రేటు
జలగల్లా పేదల డబ్బులను పీల్చేస్తున్న సిబ్బంది
పైసలిస్తే ఒక తీరు.. లేదంటే పట్టింపు కరువు
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం
రోగులు చచ్చినా పట్టించుకునేవారు లేరు
పారిశుధ్యం కూడా ఆగమాగం
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో
పేద, మధ్య తరగతి రోగులకు ఆరోగ్యంపై భరోసా ఇవ్వాల్సిన వరంగల్ ఎంజిఎం పెద్దాసుపత్రి ప్రస్తుతం నరకానికి కేంద్రంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టు పక్కల మూడు పాత జిల్లాల్లోని రోగులకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎంలో నేడు మృతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కరోనాతో నిత్యం పది నుంచి ఇరవై మంది మృతి చెందుతున్నప్పటికీ పట్టించుకునేవారు కరువయ్యారు. ఎంజిఎంలో చేరామంటే యమలోకానికే టికెట్ రిజర్వు చేసుకున్నట్లుగా పరిస్థితి మారిందనే భావన వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు పర్యటించే సమయంలో ఒకటి రెండు వార్డులను శుభ్రం చేసి వాటినే చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారు అంతా సవ్యంగా ఉందంటూ ప్రకటనలు చేస్తున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఆస్పత్రిలో ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి రోగులను రాబందుల్లా దోచుకుతింటున్నారని పలువురు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు లేకనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే అక్కడ కూడా దోపిడీకి గురికావాల్సి వస్తుందన్న పలువురు బాధితులు చెబుతున్నారు.
ఒక్కో వైద్య సేవకు ఒక్కో రేటు
కొవిడ్ రోగుల నుంచి సిబ్బంది ఒక్కో వైద్య సదుపాయానికి ఒక్కో రేటు నిర్ణయించి మరీ అందిన కాడికి దండుకుంటున్నారు. రోగిని స్ట్రెచర్ మీద తీసుకెళ్తే రూ.3 వేలు, కొద్దో గొప్పో బాగున్న బెడ్ ఇస్తే రూ.5 వేలు, బెడ్ చుట్టూ శుభ్రం చేయాలంటే రూ.1000 లు, పేషెంట్‌కు టాయిలెట్ సర్వీస్ చేస్తే ప్రతిసారి రూ.500, బెడ్‌షీట్ మారిస్తే రూ.500, స్లున్ పెడితే రూ.500, ఆక్సిజన్ బెడ్ ఇస్తే రూ.3 వేలు, వెంటిలెటర్ సర్వీస్ కావాలంటే అప్పటి డిమాండ్ మేరకు ఛార్జీ వేలల్లో వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వ్యక్తి మృతి చెందితే ప్యాకింగ్ చేసేందుకు రూ.5 వేలు, చివరికి మృతదేహాన్ని వార్డు నుంచి బయటకు తీసుకొచ్చి అప్పజెప్పేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కదా అని పైసా లేకుండా ఎంజిఎంకు వస్తే అనాథ శవంగా మారుస్తుతున్నారని పలువురు రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకరు కన్నుమూస్తేనే మరొకరికి బెడ్
ఎంజిఎం ఆస్పత్రిలో 800 పడకలతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. కోవిడ్ వార్డు లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా మరణిస్తే తప్ప మరో రోగికి బెడ్ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాగా, కుటుంబ సభ్యులు ఆమెను ఎంజిఎంకు తీసుకొచ్చారు. అక్కడి ఆర్‌ఎంఓ, సిబ్బందికి తమ సమస్య చెప్పినా వారెవరూ పట్టించుకోలేదు. పడకలు ఖాళీగా ఉన్నా, ఫ్లో మీటర్లు లేనందున ఆక్సిజన్ పెట్టలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆ మహిళ గంటల తరబడి వార్డు బయటే వేచి ఉన్నారు. ఎలాగైనా ఆక్సిజన్ పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని కోరుతున్న క్రమంలోనే, అప్పటికే చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మృతి చెందాడు. దీంతో మళ్లీ సిబ్బందిని బతిమిలాడగా అప్పుడు ఆ మహిళకు బెడ్‌ను కేటాయించి చికిత్స ప్రారంభించారు. కోవిడ్ రోగుల ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నా కనీసం వచ్చి చూసే వారు ఉండడం లేదు. కానీ కొందరు నర్సింగ్ సిబ్బంది రహస్యంగా అధిక ధరలకు ఫ్లో మీటర్లు అమర్చుతూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కోవిడ్ వైద్య సిబ్బంది విధులకు గైర్హాజర్
కొవిడ్ వార్డుల్లో పని చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా విధులకు గైర్హాజరవుతున్నారని, తమ విలువైన సేవలు అందించాల్సిన డాక్టర్లు రోగులను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రోగులకు వైద్య సేవలు చేయాల్సిన నర్సులు తమకు కేటాయించిన గదులకే పరిమితమవుతున్నారంటున్నారు.
మురికి కూపాలుగా వార్డులు
కరోనా కష్టకాలంలో చికిత్స కోసం ఎంజిఎంలో చేరిన రోగులు అపరిశుభ్ర వాతావరణంతో నరకయాతన పడుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న నర్సింగ్ సిబ్బందితో ‘ఇక్కడికి ఎందుకు వచ్చామురా.. దేవుడా!’ అంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ వార్డులోని వాష్ రూమ్‌లు చెత్తతో నిండిపోవడంతో అందులోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని, నిత్యం వాటిని శుభ్రం చేయాల్సిన సిబ్బంది మచ్చుకైనా కానరావడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. సందర్శకులు ఇష్టారాజ్యంగా వచ్చి వెళ్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, వ్యాధి విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శవాలతోనే సహవాసం
ఎంజిఎంలో కొవిడ్ చికిత్స పొందుతూ అనేక మంది ప్రాణాలు విడుస్తున్నా అవేమీ లేవంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. మృతి చెందిన వారిని కనీసం బెడ్లపై నుంచి తీసే వారే లేకపోవడంతో శవాలతోనే రోగులు సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆసుపత్రిలో ఉన్నామా లేక మార్చురీలో ఉన్నామా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రోగులు చెప్పారు. కొంతమంది శవాలను చూసి భయపడడంతో మరిన్ని రోగాలు వస్తున్నాయంటున్నారు.