HomeNewsBreaking News‘నయా’ దోపకం...

‘నయా’ దోపకం…

ఆ దవాఖానకు వెళితే అంతా గుల్లే
పిల్లల చికిత్సకు అయిన బిల్లు చూస్తే పెద్దలకు కొత్త రోగం
భారీగా దండుకుంటున్నా చర్యలు శూన్యం
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో
‘వైద్యో నారాయణో హరి’ అన్న పదానికి కొందరు వైద్యులు కొత్త భాష్యం చెబుతున్నారు. సంపాదనే ధ్యేయంగా వైద్య సేవలు చేస్తూ వైద్య వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఇదే కోవకు చెందిన ఓ వైద్యు డు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో పిల్లల ఆసుపత్రిని నెలకొలిపి అడ్డూఅదుపు లేకుండా దోపకానికి పాల్పడుతున్నాడు. ఆ దవాఖానకు చికిత్స కోసం వెళ్లితే ఇల్లు… ఒల్లు… జేబులు… ఇలా అన్ని గుల్లా అవుతున్నాయని, అక్కడికి వెళ్లి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. బిల్లులను చూస్తే పెద్దలకు కొత్త రోగం వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా డబ్బును దండుకున్నా ఫలితం శూన్యమని ఆవేదన వెలుబుచ్చుతున్నారు. నిర్లక్ష్యంతో చిన్నారుల ప్రాణాలు ఆవిరవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ సమీపం లో ఇద్దరు దంపతులు నాలుగేళ్ళ క్రితం మెట్రో నగరాలకు దీటుగా తాము వైద్య సేవలు అందిస్తామంటూ పిల్లల ఆసుపత్రిని నెలకొల్పారు. తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తామని పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. పుట్టిన ప్రాంతం కావడం, హైదరాబాద్‌ మహానగరంలో కార్పొరేట్‌ ఆసుపత్రిలో పని చేసిన తాము స్థానికంగా ప్రజలకు సేవలు చేయాలనే సంకల్పం తో ఈ ఆసుపత్రి నెలకొల్పామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌, ఖమ్మం, విజయవాడ వంటి మహానగరాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీ పిల్లల ప్రాణాలకు మాది భరోసా అంటూ మాయ మాటలు చెప్పడంతో అనేక మంది తమ పిల్లలకు ఏమాత్రం సుస్తి చేసినా ఆ దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో చిన్న పిల్లలకు వైద్యం అందించే ఆసుపత్రులు పదికిపైగా ఉన్నా ఈ ఆసుపత్రి అనతీ కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇంత వరకు బాగానే ఉన్నా… ప్రసూతి ఆసుపత్రులు స్థానికంగా 15 నుండి 20 వరకు ఉండగా ఇందులో కొంతమంది వైద్యులను మచ్చిక చేసుకొని వారికి పర్సంటేజీల ఆశ చూపి పుట్టిన ప్రతి బిడ్డను తమ ఆసుపత్రికి పం పేలా చక్రం తిప్పుతున్నాడు. ఇలా ప్రతినెల రూ. కోటిపైగా ఆసుపత్రి టర్నోవర్‌ ఉందంటే ఈ ఆసుపత్రి ఏలా నడుస్తుందో ఇట్టే అర్థమవుతోంది. శిశు వు పుట్టగానే ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంలో తల్లిదండ్రులకు ఎంతో ఆత్రుత ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని వైద్యులు శిశువు ఉమ్మునీరు మింగడాని, ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువ ఉన్నాయని, బరువు తక్కువగా ఉందని నానా రకాలుగా చెబు తూ అక్కడికి పంపగా, చేయి చూసి పరీక్షించి గంటలో ఇంటికి పంపినందుకే రూ. 10వేలకు పైగా వసూళ్ళు చేస్తున్నట్లు చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌, బరువు తక్కువగా ఉన్నాడు అంటూ ఐసియులో పెట్టి రోజుకు రూ. 25వేలకు పైగా ఫీజులు గుంజుతున్న పరిస్థితులు ఉన్నాయి. బెడ్‌ చార్జీ నుండి మొదలుకొని డాక్టర్‌, నర్సు, ప్రొఫెషినల్‌ చార్జీల పేరుతో రోజుకు రూ.4వేలకుపైగా దండుకుంటుండగా ఆక్సిజన్‌ చార్జీలు ఎక్కడ లేని విధంగా 24 గంటలు అంటూ రూ. 3వేలు, సి పాప్‌ ట్యూబ్స్‌, చార్జీల పేరుతో రోజుకు రూ. 20వేలకు పైగా ముక్కు పిండి వసూళ్ళు చేస్తున్నారు. ఇలా ఒక్క రోజుకు చిక్సిత కోసం రూ. 25వేల నుండి 30వేల వరకు ఖర్చులు వేస్తుండగా మెడిసిన్‌కు అదనంగా వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఐసియులో ఉన్న చిన్నారులను చూసేందుకు ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట మాత్రమే వారి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు అనుమతి ఇస్తూ వారికి ఏ చిక్సిత చేస్తున్నారన్నది తెలవకుండా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆవిరి అవుతున్న చిన్నారుల ప్రాణాలు
భారీగా డబ్బులు దండుకుంటున్నా ఫలితం శూన్యమని శిశువుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులపై ఉన్న శ్రద్ధ వైద్యం అందించడంలో చూపడం లేదని వాపోతున్నారు. ఇటీవల కాలంలో చివ్వెంల మండలంలోని మున్యానాయక్‌ తండాకు చెందిన ఓ గిరిజన మహిళ శిశువుకు జన్మనివ్వగా పుట్టుకతో వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యతో ఈ ఆసుపత్రికి చిక్సిత కోసం తీసుకువెళ్లారు. వారం రోజులకుపైగా చిక్సిత అందించిన సదరు వైద్యులు చివరికి తమ వల్ల కాదని చేతులు ఎత్తేసి ఆక్సిజన్‌ పెట్టి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేయగా, అక్కడ ఆ శిశువును పరీక్షించిన వైద్యులు ఇంతకు ముందు వైద్యం అందించిన డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా అయిందని తేల్చి చెప్పారు. ఆ శిశువు మృతి చెందగా కుటుంబసభ్యులు శిశువు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కొంతమంది రాజకీయ నాయకులను రంగంలోకి దింపిన ఆసుపత్రి వైద్యులు లక్షలకుపైగా డబ్బులు ఒప్పందం చేసుకొని శిశువు బంధువులతో రాజీ కుద్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో అనేక మంది చిన్నారుల ప్రాణాలు హరీమన్నాయి. వారం రోజుల క్రితం పట్టణంలోని ఓ మహిళ మగ శిశువుకు జన్మనివ్వగా, ఆ శిశువు శ్వాసకు సంబంధించి ఇబ్బందులు రావడం వల్ల చిక్తిత్స కోసం తీసుకుపోతే ఐసియుకు తరలించి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వారి కుటుంబసభ్యులకు తెలపకుండానే రోజుకు రూ. 30వేల వరకు ముక్కు పిండి వసూళ్ళు చేస్తుండడంతో సదరు వైద్యులను వారు నిలదీశారు. కొంతమంది పాత్రికేయులకు ఈ దోపిడీ గురించి వివరించగా సదరు వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ ఎదురు దాడికి దిగడం గమనార్హం. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి సదరు ఆసుపత్రి నిర్వాహకుల దోపిడీని అడ్డుకొని తమకు న్యాయం చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments