లాక్ డౌన్ తో దేశ ప్రజలను ఇబ్బంది పడుతున్నారు
ఈ 21 రోజులే మనకు కీలకం
మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ : దేశంలో చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందరినీ ఇంతగా ఇబ్బంది పెట్టే కఠిన నిర్ణయాన్ని ప్రధాని ఎందుకు తీసుకున్నారని మీలో చాలా మంది అనుకుని ఉండొచ్చు. నాపై కోపం కూడా వచ్చుండొచ్చు. కానీ అందరికీ నేనొక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను.. లాక్ డౌన్ ఒక తప్పనిసరి అనివార్య నిర్ణయం. కరోనా మహమ్మారితో యుద్ధం చేయడానికి లాక్ డౌన్ తప్ప మనకు వేరే దారిలేదు. అందుకే నిష్టూరమైనప్పటికీ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు” అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా కరోనా వైరస్ గురించే మాట్లాడిన ఆయన.. లాక్ డౌన్ వల్ల పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఇంకా, వైరస్ వ్యాప్తి, దాన్ని నిరోధించేందుకు కేంద్రం, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై చాలా విషయాలు తెలియజేశారు. కరోనాపై పోరులో కీలక సోదాహరణలను కూడా ఆయన వివరించారు.
ప్రమాదంలో మానవ మనుగడ..
చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి దాకా ఏ ఒక్కరినీ కరోనా మహమ్మారి వదిలిపెట్టడంలేదని, ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ఈ వైరస్.. మానవాళి మనుగడకే ప్రమాదకరంగా తయారైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వైరస్ ప్రమాదాన్ని గుర్తించి, ఆమేరకు తీసుకున్న జాగ్రత్తచర్యల్లో భాగమే లాక్ డౌన్ అని చెప్పారు. ”కరోనా మహమ్మారి మనందరినీ కబళించడానికి ముందే యుద్ధం చేసి దాన్ని తరిమేయాలి. అందుకోసం కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది”అన్నారు. గత వారం లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా.. ప్రజలు తమ ఇంటి గడడపనే లక్షణరేఖగా భావించి, అది దాటి బయటికి రావొద్దని సూచించడం తెలిసిందే.
జనం తీరుపై ..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించినప్పటికీ.. కొందరు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తుండటం, క్వారంటైన్ లో ఉండాల్సినవాళ్లుకూడా నిబంధనల్ని అతిక్రమించడంపై ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు మీరుతూ, ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న వారిపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఎప్పటికీ ఉండిపోదని, అదొక దశ మాత్రమేనని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ప్రభుత్వ సూచనల్ని విధిగా పాటించాలని ఆయన చెప్పారు.
కీలక సూత్రం..
ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అద్భుతైన సూత్రాన్ని వెల్లడించారు. ఒకరినొకరు తాకకుండా, దూరం పాటించడం ద్వారానే వైరస్ వ్యాప్తిని నిరోధించొచ్చని, సోషల్ డిస్టెన్స్ గా పిలుస్తోన్న ఈ ప్రక్రియను అందరూ పాటించాలని, అంతమాత్రాన తోటిమనుషులతో మానసికంగా దూరమైనట్లుకాదన్న సంగతి మర్చిపోరాదని అన్నారు. ”సోషల్ డిస్టెన్స్ ను పెంచుకోండి.. కానీ ఎమోషనల్ డిస్టెన్స్ ను తగ్గించుకోండి”అని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా బాధితులు, వైరస్ అనుమానితుల పట్ల సమాజంలో కొందరు చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
వారే సైనికులే..
కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందుభాగన ఉంటూ, కీలకంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధాని మోదీ సైనికులతో పోల్చారు. ”డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పరిసరాలు శుభ్రం చేసేవాళ్లు.. వీళ్లంతా గొప్ప స్ఫూర్తితో పనిచేస్తున్నారు”అని గుర్తుచేశారు. మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరులో వైద్య సిబ్బంది సేవల్ని ప్రశంసిస్తూ, గత ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూలో సంఘీభావ చప్పట్లు కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే.
చరకుడు పలుకులు..
2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ సమాజం ”నర్స్ అండ్ మిడ్ వైఫరీ ఏడాది”గా పాటిస్తున్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్బంగా.. భారత ఆయుర్వేదానికి వెన్నెముకలా వ్యవహరించిన చరకుడి పేరును ఆయన ప్రస్తావించారు. ”ఎలాంటి ప్రతిఫలంగానీ, లాభాపేక్షగానీ లేకుండా సమదృష్టితో రోగులకు సేవలందించేవారే నిజమైన వైద్యులు”అన్న చరకుడి పలుకుల్ని ప్రధాని కోట్ చేశారు. ప్రస్తుత తరుణంలో దేశంలోని వైద్య సిబ్బంది సాటిలేని అంకితభావంతో పనిచేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మోదీ అన్నారు.
పెరిగిన మరణాలు..
దేశంలో కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం ఉదయం సమయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 724కు పెరగగా, మరణాల సంఖ్య 17కు చేరింది. కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలూ కరోనా వ్యాప్తిపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ సహా దేశంలోని అన్ని మహానగరాల నుంచి వలస కూలీలు పెద్ద సంఖ్యలో తమ సొంత ఊళ్లకు ప్రయాణించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో జరిగి ఉండొచ్చనే అనుమానాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
నన్ను క్షమించండి!
RELATED ARTICLES