సిపిఐ డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ నదీజలాల వివాదాలపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, ప్రత్యేక రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వా రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టదాయకమన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఎపి తీరును ఎండగట్టేందుకు సిఎం కెసిఆర్ కసర్తు చేయడం అభినందనీయమన్నారు. అదే సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం విషయంలో రాష్ట్రమంతా ముక్త కంఠంతో ఉన్నదని కేంద్రానికి సంకేతాలు ఇవ్వడంతో పాటు, వివిధ రకాల అభిప్రాయాలతో మన వాదన బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దుబ్బాకలో బిజెపి ఓటమే లక్ష్యం
త్వరలో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాక నియోజకవర్గంలో బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతంలోని గ్రామాలలో సిపిఐ పార్టీ శాఖలు, బీడీ, హమాలీ , భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయని తెలిపారు. ఉప ఎన్నికపై ఇటీవల జరిగిన సిపిఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. బిజెపి ఓటమి లక్ష్యంగా పని చేయాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు.
ప్రజల గొంతు వినిపించే వారు గెలవాలి
గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రజల గొంతు వినిపించే అభ్యర్థులు ఎన్నిక కావాలని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రెండు ఎంఎల్‌సి స్థానాలపై బుధవారం జరిగిని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించామని, 6వ తేదీన జరిగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. రెండు ఎంఎల్‌సి నియోజకవర్గాల్లో పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లుగా చేర్పించేందుకు ఎఐఎస్‌ఎఫ్, మహిళా సంఘాలు, ట్రేడ్ యూనియన్‌లు, ఇతర ప్రజాసంఘాలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అయోధ్య కేసులో దోషులెవరు?
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చడం అన్యాయమని చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దోషులెవరో తేల్చకుండా 28 ఏళ్ళ పాటు కేసును విచారించిన తీరు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టినట్లు లేదన్నారు. ఇన్ని సంవత్సరాల విచారణ అనంతరం దోషులను తేల్చకపోవడంతో ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సుప్రీం కోర్టు కేసును స్వీకరించి అసలు దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, తద్వారా రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద నిర్వచనానికి అద్దం పట్టాలన్నారు.