ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు రైజెన్ జిల్లాలో ఘటన
రైజెన్: వేగంగా వస్తున్న బస్సు నదిలో పడి ఆరుగురు మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైజెన్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఛతారాపూర్ నుంచి ఇండోర్ వస్తున్న ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ రిచ్చాన్ నదిలో పడింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని, మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా మారడంతో వారిని భోపాల్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మరో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో నదిలో పడిందని ఎస్‌పి మోనిక శుక్లా వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టరుతోపాటు అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరణించిన వారిలో రెండేళ్ల వయసు గల బాలుడితోపాటు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. అయితే ఐదు మృతదేహాలను గురువారం రాత్రి, మరో మృతదేహాన్ని ఉదయం వెలికి తీశామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను రెడ్ క్రాస్ ద్వారా అందించామని కలెక్టరు ఉమాశంకర్ భార్గవ చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని కలెక్టరు పేర్కొన్నారు.