‘సామ్నా’ ఎడిటోరియల్‌లో యుపి సిఎంపై శివసేన మండిపాటు
ముంబయి : బులంద్ షహీర్ హింస ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై శివసేన మండిపడింది. యోగి పట్టణాలు, నగరాల పేర్లు మార్చడంలో బిజీగా ఉన్నారని, రాష్ట్రంలో నెలకొన్న ప్రాథమిక సమస్యలపై మాట్లాడేందుకు ఆయన తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేసింది. సైనికులకు, పోలీసులకు ఎలాంటి మతం ఉండదని, అధికారంలో ఉన్న ఉన్న మత విషయాలను పక్కబెట్టి తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలని శివసేన తన అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’ ఎడిటోరియల్‌లో ప్రస్తావించింది. రామ మందిరం అంశాన్ని మరోసారి లేవనెత్తుతూ రామాలయాన్ని ఎప్పుడు నిర్మిస్తారని ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ప్రశ్నించింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహీర్ జిల్లా సియాన్ ప్రాంతంలో అల్లరిమూకలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్, 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీనిపై శివసేన స్పందిస్తూ ముఖ్యమంత్రి యోగి పాలనలో యుపిలో అల్లర్లు జరుగుతున్నాయని విమర్శించింది. అల్లరి మూక దాడిలో పోలీస్ మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ సైనికులకు, పోలీసులకు ఎలాంటి మతం ఉండదని పేర్కొంది. అధికారంలో ఉన్న ఉన్న మత విషయాలను పక్కబెట్టి తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలని గుర్తుచేసింది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పేరు మారుస్తామన్న యోగి వ్యాఖ్యలపై కూడా శివసేన ధ్వజమెత్తింది. తన రాష్ట్రంలో ప్రాథమిక అంశాలపై మాట్లాడడంలోనే విఫలమైన యోగి ఇతర రాష్ట్రానికి వెళ్లి పేర్లు మారుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని చెప్పడానికి ముందు రామాలయాన్ని ఎప్పుడు నిర్మిస్తారని చెప్పాలని డిమాండ్ చేసింది. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన సహచర మంత్రులపై కూడా శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నగరాల పేర్లు మార్చడంలో యోగి ఆదిత్యనాథ్
RELATED ARTICLES