అసలే కరోనా.. ఆపై ప్రాణాంతక రసాయనాలు!
ఆది నుండీ ప్రజారోగ్యంపై సర్కార్ నిర్లక్ష్యం
ప్రమాదంలో ప్రజా ఆరోగ్యం
ఆందోళనలో జనం
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో ‘నకిలీ’లలు ప్రజలను ఆందోళనకు కలిగిస్తున్నాయి. పండ్లు, పాలు, విత్తనాలే కాదు.. ఏ వస్తువులు తీసుకున్నా ఏది మం చిది? ఏది నకిలీ అనేది గుర్తుపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. అసలే కరోనా మహమ్మారి, వ్యక్తులే కాదు, ఆహారపదార్థాలు, ఇతర వస్తువులను పట్టుకుంటేనే అందరిలో వైరస్ ‘ఘంటికలు’ మోగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు హానీ కలిగించే రసాయనాలతో ఆహార పదార్థాలను తయారు చేయడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాం టి కల్తీలతో ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కల్తీతో జాగ్రత్త అంటున్నప్పటికీ ఆ కల్తీని కనిపెట్టడమే పెద్ద సమస్యగా మారింది. లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. రోజు వారీ కార్యకలాపాలు మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. మరో వైపు ‘నకిలీ’ ముఠా ప్రజా ఆరోగ్యానికి సవాల్ విసురుతోంది. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకుని నకిలీ వస్తువులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. నకిలీతో కేవలం డబ్బులు, లేదా ఆ వస్తువు నష్టపోతే పర్వాలేదు. కానీ నిషేధిత రసాయనాలతో కల్తీ వస్తువులను తయారు చేయడంతో ప్రజా ఆరోగ్యానికే ప్రమాదకరమనే పలువురు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చైనాకు చెందిన నిషేధిత రసాయనిక పదార్థాలతో మామిడి, పాపయ పండ్లను పండించారు. ఇలాంటివి విక్రయిస్తుండగా పోలీసులు ఆ ముఠాను అదుపులోనికి తీసుకున్నారు. కానీ ఇది వరకే వారు మార్కెట్‌లో కొన్ని రసాయనాల పండ్లను విక్రయించారు. అలాగే హైదరాబాద్‌లో మరో వ్యక్తి కల్తీ నెయ్యిను విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎవరో ఒకరు నష్టపోయిన వారు పోలీసుల దృష్టికి వస్తేనే ఇలాంటి నకిలీల అవతారాలు బట్టబయలు అవుతున్నాయి. నకిలీలను గుర్తించి, వారిని అరికట్టడంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులే కాదు. ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఆది నుండీ ప్రజాఆరోగ్యంపై సర్కార్ నిర్లక్ష్యం
ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా నకిలీ పదార్థాలు గుర్తింపు, ఎప్పటికప్పుడు తనిఖీలు, నమూనాల సేకరణ వంటి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా జరగాలి. కానీ ఆ పనులు మొక్కుబడిగా సాగుతుండడంతోనే నకిలీ ముఠాలు రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆహార పదార్థాలను నిరంతరం తనిఖీ చేసేందుకు మున్సిపల్ శాఖలో ప్రత్యేకంగా ఆహార భద్రత అధికారులు ఉంటారు. కానీ వారు పెద్దగా తనిఖీలు చేసే పరిస్థితులు లేవు. చాలా మున్సిపాలిటీల్లో సరిపడా ఆహార భద్రతా అధికారుల కొరత ఉన్నది. దీంతో వారు మొక్కుబడిగా తనిఖీలు చేపడుతారు. అంతేందుకు సుమారు కోటి పైచిలుకు జనాభా ఉన్న మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేవలం ముగ్గురే ఆహార భద్రత అధికారులు ఉన్నారంటే ‘ఆహార భద్రత’పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. దీంతో ప్రభుత్వంలో ఉన్న డొల్లతనాన్ని నకిలీ ముఠా తమకు అనుకూలంగా మల్చుకుంటున్నది. అందుకే నకిలీలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.