HomeNewsLatest Newsనంబన్న ర్యాలీ రణరంగం

నంబన్న ర్యాలీ రణరంగం

పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ లాఠీచార్జ్‌, అరెస్టులు
బారికేడ్లను ధ్వంసం చేసిన నిరసనకారులు
మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్‌ బలప్రయోగం వద్దు :
ప్రభుత్వానికి గవర్నర్‌ విజ్ఞప్తి

కోల్‌కతా : ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యశిక్షణార్థి రేప్‌,హత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ కోల్‌కతాలో జరిగిన ‘నంబన్న అభిజన్‌” ర్యాలీలోప్రదర్శకులు, పోలీసులమధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ర్యాలీలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రదర్శకులను అదుపు చేసేందుకు, అక్కడి నుండి వెళ్ళగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. వాటర్‌ కేనన్స్‌ ట్రక్కులను, బాష్పవాయువును ప్రయోగించారు. అనేకమందిని అరెస్టు చేశారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్ళే మార్గంలో పోలీసులు నిర్మించిన బ్యారికేడ్లను ప్రదర్శకులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది, పోలీసులపై ప్రదర్శకులు రాళ్ళు, ఇటుకలను రువ్వారు. పశ్చిమ బంగా ఛత్ర సమాజ్‌ విద్యార్థి సంఘం, అసమ్మతితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల “సంగ్రామీ జౌంథా మంచా” ఏకమై కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల నుండి ఒకేసారి మంగళవారంనాడు “నంబన్న అభిజన్‌” ర్యాలీలను ప్రారంభించడంతో సమస్య ప్రారంభమైంది. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందనీ, హింస చెలరేగుతుందన్న తీవ్ర భయాల మధ్య సెంట్రల్‌ కోల్‌కతాలోని కాలేజ్‌ స్కేర్‌ నుండి, హౌరాలోని సంత్రగచ్చి నుండి ప్రధానంగా రెండు ర్యాలీలు జరిగాయి. వేలాదిమంది ఈ ర్యాలీలలో పాల్గొన్నారు. ఐతే ఈ ర్యాలీలు జరగకుండా పోలీసులలు ముందస్తు అరెస్టులు కూడా చేశారు. ఆర్‌.జి.కార్‌ ఆసుపత్రిలో ఆగస్టు తొమ్మిదోతేదీన వైద్యశిక్షణార్థి అభయపై అత్యాచారం, హత్య ఘటనపై చెలరేగిన ఆగ్రహం, కొనసాగుతున్న నిరసన ప్రదర్శనల పూర్వరంగంలో ప్రదర్శకులు “నంబన్న” కు చేరేందుకు ప్రయత్నించారు. వైద్యులకు రక్షణ ఇవ్వడంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారనీ, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శకులు “నంబన్న అభిజన్‌” ర్యాలీ నిర్వహించారు. అభయ హత్య, అత్యాచార ఘటనకు ఆమె బాధ్యత వహించాలని ప్రదర్శకులు డిమాండ్‌ చేశారు. కోల్‌కతా సంత్రగచి మైదాన్‌ పక్కనే ఉన్న ప్రిన్సెప్‌ ఘాట్‌ సమీపంలో, ఎం.జి.రోడ్‌, హస్టింగ్స్‌ రోడ్‌లలో ప్రదర్శకులు, పోలీసులమధ్య ఘర్షణలు జరిగాయి. వారు బాహాబాహీ తలపడ్డారు. ఈ ఘటనల్లో పోలీసులు, ప్రదర్శకులలో పలువురు గాయపడ్డారు. “పోలీసులు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించలేదు, చట్టాలను ఉల్లంఘించలేదు, శాంతియుతగా ప్రదర్శన చేస్తున్నాం, మాపై పోలీసులు దాడి చేశారు, వైద్యులకు రక్షణ కల్పించాలనీ, హత్యకు, అత్యాచారానికీ గురైన వైద్యశిక్షణార్థికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలనీ మేం కోరుతున్నాం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి, తన పదవికి రాజీనామా చేయాలి” అని ఒక మహిళా ప్రదర్శకురాలు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. మరోవైపు పోలీసులు ప్రదర్శకులను తప్పుపట్టారు. ప్రదర్శకులు బ్యారికేడ్లను ఉల్లంఘించారనీ, భద్రతా సిబ్బందిపై దాడి చేశారని వాదించారు. “వారు ఉల్లంఘనకు పాల్పడ్డారు. అరాచకంగా ప్రవర్తించారు, పరిస్థితిని అదుపు చేసేందుకు మేం ప్రయత్నించాం, మా అధికారులలు పరిస్థితిని చాలా చక్కగా అదుపు చేశారు, అనేకమందిని మేం నిర్బంధంలోకి తీసుకున్నాం” అని ఒక సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. తొలుత పోలీసులు లాఠీచార్జి చేశారు. నీటి గొట్టాలను ప్రదర్శకులపై ప్రయోగించారు. హౌరా బ్రిడ్జి, కోల్‌కతా ఎండ్‌, సంత్రగచ్చి రైల్వే స్టేషన్‌ సమీపంలోని కోనా ఎక్స్‌ప్రెస్‌ వేపైన ప్రదర్శకులు ర్యాలీలు చేసేందుకు ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు.
వేలాదిమంది పోలీసుల మోహరింపు బ్యారికేడ్డు, డ్రోన్లతో గస్తీ భారీ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం నంబన్న ర్యాలీని అడ్డుకునేందుకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ముందునుండే భారీ సన్నాహాలు చేశారు. వేలాదిఇమంది పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించారు. ఐతే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌ కూడా ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ప్రదర్శకులపై బలప్రయోగం చేయవద్దని, అందుకు దూరంగా ఉండాలని, హింస చెరలరేగకుండా చూడాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. అనేక ప్రాంతాలలో అల్యూమినియం బ్యారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. పాదచారులు నడిచే వంతెనలపై కూడా ఆంక్షలు విధించారు. బ్యారికేడ్లు కూడా పెట్టారు. ఇనుము, స్టీల్‌తో చేసిన బోల్టులు బిగించిన బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, స్పెషల్‌ కంబాట్‌ ఫోర్స్‌లను హూగ్లీ నదికి ఇరువైపులా మోహరించారు. డ్రోన్స్‌ల ద్వారా గస్తీ నిర్వహించారు. ప్రతి ప్రాంతంలోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కనీసం 25 మంది ఐపిఎస్‌ అధికారులు కోల్‌కతా మహానగర పరిధిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హౌరాలో ‘నంబన్న అభిజాన్‌” ర్యాలీని అడ్డుకునేందుకు 30 మందికిపైగా ఐపిఎస్‌ అధికారులు భద్రతా బలగాలకు నాయకత్వం వహించారు. పశ్చిమ బంగా విద్యార్థి సంఘం, సంగ్రామి జౌథా మంఛాలు సంయుక్తంగా ఈ నంబన్న అభిజాన్‌ ర్యాలీలకు పిలుపు ఇచ్చాయి. ఈ ర్యాలీలు నిర్వహించకూడదనీ, ర్యాలీలు నిర్వహించడం చట్టవిరుద్ధమనీ పోలీసులు ప్రకటించినప్పటికీ పలు చోట్ల నుండి ఈ ర్యాలీలు జరిగాయి. హౌరాలో 2,000 మంది పోలీసులను మోహరించారు. ఎడిజి, 13 మంది డిఐజిలు, 15 మంది ఎస్‌పి స్థాయీ అధికారులు హౌరా ర్యాలీని పర్యవేక్షించారు. నాలుగు వాటర్‌ కేనన్స్‌ ట్రక్కులను ప్రదర్శకులపై ప్రయోగించారు.మంగళవార ఉదయం నుండే వాహనాల రాకపోకలను నియంత్రించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments