ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ ప్రకటన
నందిగ్రామ్: పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి పార్టీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయంగా సువేందుకు గట్టిపట్టున్న ఆయన స్థానమై న నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు మమత తెలిపారు. సోమవారం నందిగ్రామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. తమ పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీల్లో చేరిన వారి గురించి తనకు ఎలాంటి ఆందోళనా లేదన్నారు. టిఎంసి స్థాపించినప్పుడు వారు పార్టీలో లేరని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో దోచుకున్న డబ్బును రక్షించుకోవడం కోసమే కొంతమంది అధికార పార్టీని వీడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నందిగ్రామ్ నుంచే ప్రారంభించానని చెప్పారు. ఇది తనకు అదృష్ట ప్రదేశమన్నారు. అందువల్లే ఈ సారికూడా తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు మమత తెలిపారు. నందిగ్రామ్ స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాల్సిందిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాగా, అదే వేదికపై ఉన్న సుబ్రతా మమతా విజ్ఞప్తికి వెంటనే అంగీకరించారు. అయితే మమత ప్రస్తుతం భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీలైతే తాను భవానీపూర్, నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కొంత మంది బెంగాలను బిజెపికి విక్రయించాలని చూస్తున్నారని, అందుకు తాను ఎప్పుడూ అనుమతించబోనన్నారు. పార్టీని వీడిని వారికి నా శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యానించారు. ఆ తరువాత వారు దేశానికి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా కూడా ఉండండి కానీ, బెంగాల్‌ను బిజెపికి విక్రయించే సాహసం చేయకూడదని సూచించారు. తాను జీవించి ఉన్నంత వరకు అలాంటి దానినికి తాను అంగీకరించబోనని మమత స్పష్టం చేశారు. బిజెపిపై మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీని ‘వాషింగ్ మెషిన్’ తో పోల్చారు. “బిజెపి ఓ వాషింగ్ మెషిన్. నలుపుతో అందులోకి వెళితే.. తెలుపై బయటికి వస్తారు. వాషింగ్ పౌడర్ బిజెపి… వాషింగ్ పౌడర్ బిజెపి…” అంటూ మమతా బెనర్జీ కాషాయ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసేందుకు ఆ నాటి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాడనికి వ్యతిరేకంగా నందిగ్రామ్‌లో పెద్ద ఎత్తున ప్రజలను నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బలవంతపు భూసేకరణను నిలువరించిన రైతు బంధుగా మమతా బెనర్జీ పేరు గడించారు. సెజ్‌ల పేరిట ప్రభుత్వం లాక్కుంటున్న వ్యవహారంలో స్థానిక రైతులకు అండగా నిలిచి మమత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీటితో పాటు ‘మా ప్రజలకు దగ్గరైన తీరు, ఆమె సాధించిన అఖండ విజయం ఆమె రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయి. సుబేందు అధికారి ఈ ఉద్యమాన్ని తీవ్రంగా నడిపించారని, మమతకు చేదోడుగా, వాదోడుగా ఉంటూ అనుకున్న విజయ తీరాల వైపు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారని అంతా భావిస్తారు. కాగా, ఇటీవలే ఆయన టిఎంసిని వీడి బిజెపిలో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తరువాత సువేందు.. రాష్ట్రంలో మమతా అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రాంతాన్ని విస్మరించారని తరుచూ విమర్శిస్తున్నారు.
నందిగ్రామ్ నుంచి పోటీ
RELATED ARTICLES