HomeNewsBreaking Newsధోనీ-కోహ్లీల పోరు

ధోనీ-కోహ్లీల పోరు

నేటి నుంచే ఐపిఎల్‌ ఎడిషన్‌ ప్రారంభం
తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిఎస్‌కెతో ఆర్‌సిబి ఢీ
రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌, డిడి స్పోర్ట్‌లో ప్రసారం
చెన్నై: అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేశవాళీ క్రికెట్‌ పండగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు నేడు తెరలేవనుంది. క్రికెట్‌ అభిమానులకు పసందైన మ్యాచులు అందించేందుకు ఐపీఎల్‌ 12వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచే ఐపిఎల్‌ 12వ సీజన్‌ మొదలవనుంది. ‘మార్చి 23 నుంచి మే 5’ వరకు గ్రూప్‌ దశ పోటీలు జరగనున్నాయి. ఒకొక్క జట్టు తమ హోమ్‌ గ్రౌండ్స్‌లో ఏడు, ప్రత్యర్థి గడ్డపై ఎడు చొప్పున మొత్తం 14 మ్యాచులు ఆడనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కె), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు(ఆర్‌సిబి) మధ్య శనివారం మొదటి మ్యాచ్‌తో ఈ కొత్త సీజన్‌ ప్రారంభంకానుంది. స్టార్‌ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీల నేతృత్వంలో ఇరు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఇరు జట్లు కఠిన సవాళ్లకు సిద్ధమయ్యాయి. 2008 నుంచి ప్రారంభమైన ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎదురులేని శక్తిగా ఎదిగింది. ఇప్పటి వరకు అత్యధికంగా మూడు సార్లు ఈ ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ మాత్రం టోర్నీ ఆరంభం నుంచి పోటీల్లో పాల్గొంటున్న ఒక్క సారి కూడా టైటిల్‌ గెలవలేవ పోయింది. ఈ సారైన విజేతగా అవతరిస్తుందా వేచి చూడాల్సిందే. ఇరు జట్లలో స్టార్‌ ఆటగాళ్లకు కొదువలేదు. భారత స్టార్‌ ఆటగాళ్లతో పాటు విదేశీ టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు కూడా చెన్నై, బెంగళూరు జట్లలో ఉన్నారు. అందుకే శనివారం జరిగే మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయం. ఇక కోహ్లీ జట్టు ఆరంభంలో మంచి ఫలితాలు సాధించినా.. ఆఖర్లో మాత్రం తేలిపోతుంది. ఈ సారి అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా కోహ్లీ ఎలాంటి ప్రణాళికలు ఏర్పర్చుకున్నాడో చూడాలి. విరాట్‌ కోహ్లీపైనే ఈసారి అందరి దృష్టి కేంద్రికృతమై ఉంది. ఎందుకంటే భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందిస్తూ నెంబర్‌ వన్‌ జట్టుగా నిలబెట్టిన కోహ్లీ ఐపిఎల్‌లోనూ తన జట్టును విజేతగా నిలపాలని అభిమానులు ఆశిస్తునారు. జట్టులో కోహ్లీతో పాటు ఎబి డివిలియర్స్‌ ప్రధాన ఆటగాడు. మరోవైపు ఓపెనర్‌ పార్థిప్‌ పటేల్‌, ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ, హిట్టర్‌ హేట్‌మైర్‌తో కూడిన బ్యాటింగ్‌ దళం స్ట్రాంగ్‌గానే ఉంది. బౌలింగ్‌లో టిమ్‌ సౌథీ, ఉమేష్‌ యాదవ్‌, చాహల్‌ వంటి అనుభవగ్నులైన ఆటగాళ్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందురూ కలిసి కట్టుగా రాణిస్తే ఆర్‌సిబికు విజయం సాధించడం సులభమే. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటి నుంచే బలమైన జట్టుగా ఉంది. దాదాపు ఆటగాళ్లు టోర్నీ ఆరంభం నుంచి అదే జట్టులో కొనసాగడం సిఎస్‌కెకు ప్లస్‌ పాయింట్‌. కెప్టెన్‌ కూల్‌ ధోనీతో పాటు, సురేశ్‌ రైనా, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసీస్‌ వంటి స్టార్‌ బ్యాట్స్‌మన్స్‌లు ఆ జట్టుకు అదనపు బలం. మరోవైపు ఆల్‌రౌండర్లు కేదర్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజాతో పాటు బౌలర్లు దీపక్‌ చాహర్‌, డేవిడ్‌ విల్లే, మోహిత్‌ శర్మల వంటి స్టార్‌ ఆటగాళ్లతో సిఎస్‌కె ఎదురులేని జట్టుగా ఉంది. ఆర్‌సిబితో పోలిస్తే సిఎస్‌కె చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాలి. కానీ ఆర్‌సిబిలో కోహ్లీ, డివిలియర్స్‌ రాణిస్తే ఏ జట్టుకైన ప్రమాధమే. వీరిద్దరికి ఈ పొట్టి ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఇక సిఎస్‌కె తమ నాలుగో ట్రోఫీ వేటలో ఉంటే.. మరోవైపు ఆర్‌సిబి తొలి టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీ ముగిసిన పది రోజుల్లోనే ప్రపంచకప్‌ సమరం మొదలుకానుంది. అందుకే ఈ టోర్నీ అందరూ ఆటగాళ్లకు కీలకంగా మారింది. ఇంగ్లాండ్‌ వేదిక గా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని దేశాల క్రికెటర్లకు ఐపిఎల్‌ మంచి అవకాశమనే చెప్పాలి. ఫామ్‌లో లేని ఆటగాళ్లు తమ ఫామ్‌ను తిరిగి సాధించేందుకు వారి ముందు ఇదొక మంచి చాన్స్‌. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అన్ని జట్లు తమ ఆటగాళ్లపై అధిక పని భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని సమాచారం. తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, గాయాల బరిన పడకుండా జాగ్రత్తగా ఆడాల్సి ఉండడంతో ఈసారి ఆటగాళ్లు అధిక ఒత్తిడిలో ఉన్నారనే చెప్పాలి. శనివారం చెన్నై వేదికగా ఇరు జట్లు తమ పూర్తి స్థాయి జట్లతో తొలి పోరుకు సిద్ధమయ్యాయి. మరోసారి సిఎస్‌కె ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.
బ్యాటింగే సిఎస్‌కె బలం..

ఇప్పటికే మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బ్యాటింగే బలం. జట్టులోని దాదాపు 8 మంది ఆటగాళ్లు టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మన్స్‌గా ఉండడం జట్టుకు అదనపు బలం. ప్రత్యర్థి జట్టు ఎలాంటి లక్ష్యాన్ని నిర్ధేశించినా సులువుగా అందుకోగల సామర్థ్యం సిఎస్‌కెకు ఉంది. కెప్టెన్‌ ధోనీ, షేన్‌ వాట్సన్‌, ఫాఫ్‌ డుప్లెసీస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయడు, బ్రావో, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాలతో కూడిన టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో సిఎస్‌కె అంత స్ట్రాంగ్‌లేదనే చెప్పాలి. ఎక్కువగా ఆల్‌రౌండర్ల మీదే ఈ జట్టు ఆదారపడాల్సి ఉంది. ప్రధాన బౌలర్లు అయిన డేవిడ్‌ విల్లే, మోహిత్‌ శర్మ, దీపక్‌ చాహర్‌పైనే అధిక భారం ఉంటుంది. గత సీజన్‌ ఫైనల్లో షేన్‌ వాట్సన్‌ అసాధారణ బ్యాటింగ్‌తో సంచలన విజయం తమ జట్టుకు అందించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో వాట్సన్‌ అద్భుతమైన శతకం బాదాడు. ఫలితంగా సిఎస్‌కె మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. గత సీజన్‌లో అంబటి రాయుడు, రైనా కూడా మెరుగ్గా ఆడారు. ఇక సురేశ్‌ రైనా ధనాధన్‌ క్రికెట్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌. ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ల జాబితాలో రైనా మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో రైనా అత్యధికంగా (4,985 పరుగులు) చేశాడు. మరో 15 పరుగులు చేస్తే 5వేల క్లబ్‌లో రైనా దూసుకుపోతాడు. ఇక ధోనీ కూడా ఈ టోర్నీలో బలమైన షాట్లు ఆడుతూ అభిమానులను ఆలరిస్తాడు. ఇక నాలుగో టైటిల్‌పై కన్నేసిన సిఎస్‌కె మరోసారి విజయఢంకా మోగించాలని భావిస్తోంది.
అత్యధిక విజయ శాతం..
ఇక సిఎస్‌కె విజయాల రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు సిఎస్‌కె 150 మ్యాచులు ఆడగా.. అందులో 91 విజయాలు, 57 ఓటములను చవిచూసింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఓవరాల్‌గా విజయాల శాతం చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌దే అందరికంటే మెరుగ్గా ఉంది. సూపర్‌ కింగ్స్‌ విజయ శాతం (61.07) ఉంది. రెండో స్థానంలో ముంబయి ఇండియన్స్‌ (57.01) ఉంది.
ఆర్‌సిబి ఈ సారైనా..
టోర్నీ ఆరంభం నుంచి ప్రతి ఏడాది బరిలో దిగుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అయితే ఈసారైన కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సిబి విజేతగా నిలవాలని, అటు ఫ్రాంచైజీతో పాటు ఆర్‌సిబి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మూడు సార్లు ఫైనల్‌ వరకు వెళ్లిన ఆర్‌సిబికి చివరికి నిరాశే మిగిలింది. ఇక ఈసారి కూడా చెన్నైను ఓడించడం రాయల్‌ ఛాలెంజర్స్‌కు అంతా తేలికైన విషయం కాదు. గత గణంకాలు చూస్తే చెన్నైకే మెరుగైన విజయావకాశాలున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 22 మ్యాచుల్లో తలపడగా సిఎస్‌కె 14సార్లు విజయం సాధించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే.. గత పదకొండేళ్లుగా చిదంబరం స్టేడియంలో సిఎస్‌కెపై ఆర్‌సిబి ఒక్క విజయం కూడా సాధించలేక పోయింది. 2008 మే 21న సూపర్‌ కింగ్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సిబి.. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ జట్టుపై ఇక్కడ గెలవలేకపోయింది. అలాగే ఇరు జట్ల మధ్యా జరిగిన గత ఆరు మ్యాచుల్లోనూ ధోనీసేనే గెలుపొందడం మరో విశేషం. దీంతో శనివారం జరగనున్న మొదటి మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ సొంతం చేసుకున్న సిఎస్‌కె నాలుగోసారి విజయఢంకా మోగించాలని భావిస్తోంది. మరోవైపు ఈ సారైనా ఐపిఎల్‌ విజేతగా నిలవాలని ఆర్సిబి పట్టుదలగా ఉంది.
మరో 15 చేస్తే చాలు..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మరో 15 పరుగులు చేస్తే మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటికే ఐపిఎల్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రైనా (4,985) పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంకా 15 పరుగులు చేస్తే రైనా 5వేల పరుగుల క్లబ్‌లో చేరిపోతాడు. ఈ క్లబ్‌లో చేరిన తొలి క్రికెటర్‌గా ఐపిఎల్‌ చరిత్రలో నిలిచిపోతాడు. శనివారం ఆర్‌సిబితో జరిగే తొలి మ్యాచ్‌లోనే రైనా ఈ ఫీట్‌ను అందుకునే చాన్స్‌ ఉంది.

జట్ల వివరాలు: (అంచనా)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : మహేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసీస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, కేదర్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, డేవిడ్‌ విల్లే, మోహిత్‌ శర్మ.
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), మోయిన్‌ అలీ, ఎబి డివిలియర్స్‌, శిమ్‌రొన్‌ హేట్‌మైర్‌, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, యాజువేంద్ర చాహల్‌.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments