కానీ.. టీమిండియా భవిష్యత్ ముఖ్యం
యువతకు ఆవకాశాలు అవసరం
ఫిట్‌నెస్‌లో కోహ్లీ తరువాతే మెస్సీ, రోనాల్డో
బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వీరాభిమానిని, నాలా ఇంకెవరూ ఉండరు అని భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. నేను ధోనీకి వీరాభిమానిని అయినా టీమిండియా భవిష్యత్ కోసం యువకులకు అవకాశాలిచ్చా అని అన్నాడు. రోహిత్ శర్మ మా నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఉన్నాడు, అతని ప్రతిభ తెలిసే టెస్ట్ ఫార్మాట్‌లో అవకాశాలు ఇచ్చాం అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ స్పోరట్స్ స్టార్‌తో మాట్లాడుతూ… ’ఒక ప్యానెల్ సభ్యునిగా ప్రొఫెషనల్ డ్యూటీని పక్కన పెడితే.. ఎంఎస్ ధోనీకి వీరాభిమానిని. ధోనీ కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. టెస్టుల్లోనూ జట్టును నెం.1 స్థానంలో నిలిపాడు. ఈ ఘనతలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. రిటైర్మెంట్ గురించి మహీనే నిర్ణయం తీసుకోవాలి. ఒక సెలక్టర్‌గా టీమిండియా భవిష్యత్ గురించి ఆలోచించి యువ క్రికెటర్లకి అవకాశాలు ఇచ్చా’ అని తెలిపాడు. ’మా హయాంలో రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఉన్నాడు. అతని ప్రతిభ తెలిసే టెస్ట్ ఫార్మాట్‌లో అవకాశాలు ఇచ్చాం. ఓపెనర్‌గా టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. డబుల్ సెంచరీలతో వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. గత నాలుగైదు నెలల్లో టెస్ట్ ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేసాడు. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ’పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నాలుగో స్థానం కోసం చాలా ప్రయోగాలు చేసాం. శ్రేయాస్ అయ్యర్ రూపంలో చివరకు పరిష్కారం దొరికింది. అతడు బాగా ఆడుతున్నాడు. టెస్టుల్లో హనుమా విహారి రాణిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో చాలా క్రికెట్ ఆడలేదు. ఎంతో కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎప్పుడూ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు’ అని ఎమ్మెస్కే తెలిపాడు.
కోహ్లీ 17 కిలో మీటర్లు పరిగెడతాడు…
రాట్ కోహ్లీ టీమిండియా ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. భారత జట్టులో కోహ్లీ ఓ బెంచ్ మార్కును సెట్ చేసాడు. కేవలం తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరిని ఆ విధంగా తయారుచేస్తున్నాడు. ఇక విరాట్ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియాలో ఫిట్‌నెస్ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం భారత క్రికెటర్లకి ఉన్న ఫిట్‌నెస్ క్రికెట్ ప్రపంచంలోని మరే జట్టుకీ లేదంటే నమ్మండి. ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియెనల్ మెస్సీల కంటే కోహ్లీకే ఫిట్‌నెస్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందట. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి మరియు ప్రమాణాలను రొనాల్డో మరియు మెస్సీలతో పోల్చాడు. సాధారణంగా ఫుట్‌బాల్, రగ్బీ ఆడే ప్లేయర్లకు అత్యున్నత ఫిట్‌నెస్ ఉండాలి. ఎందుకంటే.. గంటల పాటు మైదానంలో పరుగులు పెడుతూనే ఉండాలి కాబట్టి. రొనాల్డో, మెస్సీ తదితర ఆటగాళ్లు ఒక్కో మ్యాచ్‌ల్లో సగటున 8 నుంచి 13 కిలోమీటర్లు పరుగెత్తుతారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే కోహ్లీ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే.. సగటున 17 కిలోమీటర్ల దూరం పరుగెత్తుతాడని ఎమ్మెస్కే అంటున్నాడు. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి గురించి ఆశ్చర్యకర విషయాలు తెలిపాడు. ’క్రికెట్ ఆట టీమ్ స్పోరట్స్. ఇందులో ఆటగాళ్లు పెద్దగా కష్టపడరు అని చాలామంది భావిస్తుంటారు. ఓ భారీ ఇన్నింగ్స్ ఆడిన క్రమంలో కోహ్లీ సగటున 17 కిలోమీటర్ల దూరం పరుగెత్తుతాడు. ఇవి నేను చెపుతున్న గణాంకాలు కావు. టీమిండియా సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న సభ్యులకు జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. ఫిట్‌నెస్‌కు సంబంధించి రోజువారి విశేషాలు ఫిట్‌నెస్ ట్రైనర్లు తెలుసుకుంటారు’ అని ఎమ్మెస్కే తెలిపాడు.
ధోనీకి వీరాభిమానిని..
RELATED ARTICLES