యథావిధిగా 6,545 కేంద్రాలు
రైతులు ఆందోళన చెందొద్దు
సిఎం కెసిఆర్ స్పష్టీకరణ
తేమ శాతం లేకుండా చూసుకోవాలని రైతులకు సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గత సీజన్‌లో రాష్ర్ట వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధా న్యం సేకరణ జరపాలని సిఎం పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంత మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని సిఎం ప్రకటించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు. సోమవారం ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ అధికారులునర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
23న పోడు భూములపై సిఎం సమావేశం
పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారం ప్రధాన అంశాలుగా చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో శనివారం ఉదయం 11.30 నుండి రోజంతా ఈ సమావేశం జరగనుంది. ఇందులో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, అడవి తరిగిపోకుండా ఉండేందుకు కావలసిన అన్ని చర్యల గురించి చర్చించి సమగ్ర కార్యాచరణను రూపకల్పన చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రతికా ప్రకటనలో తెలియజేసింది. హరితహారం ఫలితాలను అంచనా వేస్తూ మరింత విస్తృత స్థాయిలో ఫలితాలను రాబట్టటం కోసం చేపట్టవలసిన భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డిఎఫ్‌ఓ లతో పాటు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొంటారు.
రేపటి నుండి అధికారుల బృందం హెలికాప్టర్ సర్వే
ఈనెల 20,21,22 తేదీలలో పోడు భూముల సమస్యను అధ్యయనం చేయడం కోసం క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛోంగ్తు, పిసిసిఎఫ్ శోభలతో కూడిన అధికార బృందం హెలికాప్టర్ ద్వారా సంబంధిత అటవీ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు.
ధాన్యాన్ని సేకరిస్తాం
RELATED ARTICLES