పలుచోట్ల ఇంకా ప్రారంభంకాని కేంద్రాలు
షురూ అయిన చోట తూకం వేయకుండా జాప్యం
అకాలవర్షాల భయంతో రైతుల్లో ఆందోళన
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రైతన్నలు తమ గోస ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు ప్రకృతి ప్రకోపం చూపిస్తూ చేతికొచ్చిన పంటను నేలపాలు చేయగా, ఉన్న పంటను అమ్ముకుందామని చూస్తే సకాలంలో కొనుగోళ్లు జరుగక నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిపేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసే లోగానే గత నెలలో వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో తడిసిన ధాన్యం కొనేందుకు మిల్లర్లు వెనుకడుగు వేశా రు. వర్షాలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో మరోసారి అకాల వర్షాలు కురిసి కళ్లాలపై ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యం కావడంతో అనేక చోట్ల రైతులు తీవ్రం గా నష్టపోయారు. వరంగల్ జిల్లాలో 196 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా పలు చోట్ల ప్రారంభం కాలేదు. వరంగల్ జిల్లాలో 52 మిల్లులకు ఇప్పటివరకు 3.50 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు మాత్రమే జరిపారు. హనుమకొండ జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వీటిలో ఐకెపి ద్వారా 54, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 109 ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 150 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు తెరిచిన చోట కూడా ధాన్యం తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో కళ్లాల్లోనే ధాన్యం వర్షార్పణం అవుతున్నది. పలు చోట్ల వర్షానికి ధాన్యం కొట్టుకు పోయిన ఘటనలు ఉన్నాయి. కాగా పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభం కాలేదు. పిఎసిఎస్ సంగెం పరిధిలో 6 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మంజూరు చేయగా నాలుగు గ్రామాల్లో ప్రారంభించారు. మిగతా రెండు గ్రామాల్లో అధికారుల నిర్లక్ష్యం, సిఇఒ అలసత్వం వల్ల కుంటపల్లి, ఎల్గూర్‌రంగంపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట డివిజన్‌లోని పలు మండలాలలో పూర్తిస్థాయిలో కేంద్రాలను ప్రారంభించలేదు. 20 రోజుల నుంచి కల్లాల వద్ద పడికాపులు కాస్తూ పండించిన ధాన్యాన్న అమ్ముకోడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి నిరంతర పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు.
తడిసిన ధాన్యం విక్రయించిన మిల్లర్లు
అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం మామూలు ధాన్యం ధరకే కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఒక దశలో మిల్లర్లతో సమావేశమై తడసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా విక్రయించే ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్ర స్థాయిలో సిఎం, మంత్రి ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కొనుగోలు కేంద్రాలలలో తడిసిన ధన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు సుముఖత చూపడం లేదు. తడిసిన ధాన్యాన్ని 17 శాతంలోపు తేమ ఉండేలా ఆరబెట్టి తీసుకొస్తేనే కొంటామని తేల్చి చెబుతున్నారు. నిబంధనల పేరుతో మిల్లర్లు ససేమిరా అంటుండంతో తిరిగి రైతులు ధాన్యం రాశులను కళ్లాల్లోనే ఆరబెడుతూ వేచి చూస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లుజరిగేదెన్నడు?
RELATED ARTICLES