HomeNewsBreaking Newsధాన్యం కొనకపోతే... ప్రగతి భవన్‌ గోడ బద్దలు

ధాన్యం కొనకపోతే… ప్రగతి భవన్‌ గోడ బద్దలు

కల్లాల్లోకి కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసేవరకు కాంగ్రెస్‌ ఉద్యమం ఆగదని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు “కల్లాల్లో కాంగ్రెస్‌” కార్యక్రమంలో భాగంగా మార్కెట్‌ యార్డులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కమిషనర్‌ కార్యాలయం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌లను తోసుకుని కాంగ్రెస్‌ శ్రేణులు ముందుకు వచ్చే ప్రయత్నం చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ అక్కడే భైఠాయించారు. ఈ ధర్నలో రేవంత్‌ రెడ్డితోపాటు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వి.హనుమంత్‌రావు, దామోదర రాజనరసింహ, పొన్నా ల లక్ష్మయ్య, ఎంఎల్‌సి జీవన్‌ రెడ్డి, ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సీతక్క, మాజీ మంత్రులు డాక్టర్‌ చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జెఎసిగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జెఎసి అంటే జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ అని అభివర్ణించారు. బిజెపి, టిఆర్‌ఎస్‌లు నాటకలాడుతూ ధాన్యం కొనకుండా రైతులను మోసగిస్తున్నాయని విమర్శించారు. డిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కార్యాచరణ ఏంటో సిఎం కెసిఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై పార్లమెంట్‌ను స్తంభింపచేయాలన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద టిఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతుల పక్షాన మాట్లాడతారని ఎదురు చూశామని, మోసపూరిత వైఖరినే కొనసాగించారన్నారు. ఇందిరా పార్క్‌ వద్ద ఏసిలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా అని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే రైతుల కల్లాల వద్దకు వెళ్లాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి మీరు డిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని నిలదీయాలన్నారు.
కెసిఆర్‌ దిగిపో: భట్టి
పరిపాలించడం రాకపోతే పాలనను వదిలేయ్యాలని సిఎల్‌పి నాయకులు భట్టి విక్రమార్క సిఎం కెసిఆర్‌కు సూచించారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొనకుంటే ఎవరు కొంటారని ప్రశ్నించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామంటే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు రాలేదని గుర్తు చేశారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ఒక్కటేనని, ముందు ఒకలాగా, వెనక మరోలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రైతుల భూములను ప్రైవేట్‌ పరం చేయడానికి కుట్ర చేస్తున్నాయన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments