స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : వానాకాల సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ప్రస్తుతానికి ధాన్యం కొనలేమని కేంద్రం స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ (సిఎఫ్‌సిఎ) గురువారం తేల్చిచెప్పింది. రబీ సీజన్‌కు ఇంకా చాలా వ్యవధి ఉందని, అప్పటి ధాన్య సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఒక్కో రాష్ట్రం నుంచి సేకరణ ఒక్కో రకంగా ఉంటుందని, కాబట్టి, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వివరించింది. దేశంలో సంతృప్తికరమైన స్థాయిలో నిల్వలు ఉన్నందున వరి, గోధుమ పంటను తగ్గించుకోవాలని హితవు పలికింది. మరింత ధాన్యాన్నినిలువ చేసే పరిస్థితి లేదని సిఎఫ్‌సిఎ తన ప్రకటనలో పేర్కొంది. ఖరీఫ్ సీజన్‌లో ఎంత ధాన్యాన్ని సేకరించాలనే నిర్ణయాన్ని అంశాన్ని దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలు, రాష్ట్రాలు చేసే సేకరణ వంటి పలు అంశాలను పరిశీలించిన అనంతరం తీసుకున్నామని తెలిపింది. కాగా, ఇప్పటికే సరిపడా నిల్వలున్న కారణంగా, ఎగుమతి అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎగుమతులకు ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని, తదనుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. ధాన్యాన్ని కేంద్రం కొనే పరిస్థితి లేనందున, రబీ సీజన్‌లో నూనె గింజలు, పప్పు ధాన్యాలు వంటి వాణిజ్య పంటలను వేసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల రైతులకు హితవు పలికాయి. రాష్ట్రాలు ఎంత వరకూ సేకరించగలవో, అంత వరకే పరిమితం కావాలని రైతులకు ఈ వర్గాలు సూచించాయి. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే ధాన్యం , బియ్యం సేకరణ జరుగుతుందని గుర్తుచేశాయి. అప్పటి నిర్ణయాల్లో భాగంగా తెలంగాణ నుంచి 60 మెట్రిక్ టన్నుల ధాన్యం, 40 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని, ఆ ప్రకారమే కేంద్రం కొనుగోళ్లు జరిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అదనంగా కొనే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. ప్రత్యామ్నాయ పంటల పట్ల దృష్టి పెట్టాల్సిందిగా కోరాయి.
ధాన్యం కొనం బాయిల్డ్ రైస్ తీసుకోం
RELATED ARTICLES