HomeNewsBreaking Newsధరల నియంత్రణలో కేంద్ర సర్కార్‌ విఫలం

ధరల నియంత్రణలో కేంద్ర సర్కార్‌ విఫలం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని, అధిక ధరలను కట్టడి చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ విమర్శించారు. మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నదని గ్రహం వ్యక్తం చేశారు. లీటర్‌ పెట్రోల్‌ ధర కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండడం ఆం దోళనకరమన్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల, కూరగాయల ధరలను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కూరగాయల హారాలను ధరించి, ప్లకార్డులు చేతబూని పెరిగిన వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ శ్రీలంక, పాకిస్థాన్‌ తరువాత ఇప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రధాని మోడీ తప్పుడు విధానాల వల్లే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. జాతీయ ఆహార భద్రతను నిర్ధారిస్తున్న వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో రానున్న రోజుల్లో దేశంలో మిలియన్‌ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు జారిపోవచ్చునని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కూరగాయల కృత్రిమ ధరల పెంపుతో రైతులు, వినియోగదారులు ఇరువురూ దోపిడికి గురవుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని పశ్య పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అదుపులోకి తీసుకువచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించాలని పశ్య పద్మ డిమాండ్‌ చేశారు.
పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న ప్రజలు : ప్రేమ్‌ పావని
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు సీనియర్‌ నాయకురాలు పి.ప్రేమ్‌ పావని మాట్లాడుతూ ఇంటి ఆదాయమంతా కూరగాయలు కొనడానికే సరిపోతున్నదన్నారు. నిరంతరంగా పెరుగుతున్న అధిక ధరలతో ప్రతి గృహిణి కష్టాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అత్యంత ఖరీదైనవిగా మారడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ప్రధాని మోడీ స్పందించకుండా, విచిత్రంగా మౌనం వహించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రతి వస్తువుపై జిఎస్‌టి విధించి ప్రజలను మోడీ ప్రభుత్వం దోచుకుంటుందని ప్రేమ్‌ పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మౌనం వీడి విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేనట్లయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆమె హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఎస్‌. ఛాయాదేవి, సహాయ కార్యదర్శి నళిని, కార్యవర్గ సభ్యురాలు ఫైమీద, జె.లక్ష్మి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని, ఉపాధ్యక్షురాలు షహనా అంజుమ్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నండూరి కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments