అమృతకాలం కాదు, వినాశకాలం
సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం విమర్శ
ప్రభుత్వ అహంకార వైఖరిపై రాజ్యసభలో సర్వత్రా ఎంపిల తీవ్ర అసంతృప్తి
పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్టెట్ సమావేశాల చివరి రోజు గురువారంనాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన నరేంద్రమోడీ ప్రభు త్వం ఈ సమస్యలను ప్రజావేదికపై చర్చించకుం డా తప్పించుకుని పారిపోయిందని, రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సిపిఐ,కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునదాడి చేశాయి. సభమధ్యలోకి సభ్యులు దూసుకెళ్లి నినాదాలు చేశారు. శుక్రవారం వరకూ జరగాల్సిన సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ముందుగానే ముగించిం ది. రాజకీయ సౌలభ్యంకోసం మోడీ ప్రభుత్వం రాజ్యసభను రెండు రోజు లు ముందుగానే ముగించిందని సభ్యులు విమర్శించారు. రైతుకు ఇచ్చిన హామీలను కూడా మోడీ ప్రభుత్వం ఉల్లంఘించిందని విమర్శించా రు. పార్లమెంటు గురువారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో సభ్యులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం తో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. చట్టసభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నులపట్ల సభ్యులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు. బిజెపి ప్రభుత్వం సమస్యలను దాటవేసిందని, ప్రజాస్వాబద్ధంగా చర్చకు తిరస్కరించి అహంకారపూరితంగా వ్యవహరించిందని సభ్యు లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం మాట్లాడుతూ, రోజువారీ ప్రాతిపదికపై పెరుగుతున్న చమురు ధరలపై చట్టసభలో చర్చించడానికి ప్రభుత్వం భయపడి పారిపోయిందని నిశితంగా విమర్శించారు. దేశం వలసపాలన నుండి విముక్తి చెంది 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహిస్తున్నారని చెబుతూ, “ఇది అమృతకాలం కాదు, వినాశకాలం” అని బినోయ్ విశ్వం మండిపడ్డారు. సిఆర్‌పిసి ఐడెంటిఫికేషన్ బిల్లుపై కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేని, ఆదరాబాదరాగా బిల్లును ఆమోదింపజేసుకున్నారని ఆయన అన్నారు. దేశ అత్యున్నతమైన ప్రజావేదికగా నిలిచిన చట్టసభ పార్లమెంటులో ప్రజాసమస్యలను చర్చంచడానికి అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. గురువారంనాడు రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ కూడా గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పటి నుండి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదని, దీంతో రెండు రోజుల సమయం వృథా అయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సభా సలహాసంఘం (బిఎసి) సమావేశం సందర్భంగా నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమయం కేటాయించిందని, అయినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం సమయం ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజ్యసభలో ్రప్రతిపక్షనేత మల్లికార్జునఖర్గే,లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు అధీర్ రంజన్ చౌధురి ఇదే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం బిఎసిలో వాగ్దానాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సమస్యలు చర్చించకుండా పారిపోయిందని విమర్శించారు. చివరిరోజు రాజ్యసభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంప్రదాయబద్ధంగా చేయవలసిన ముగింపు ప్రసంగం చేయలేదు. లోక్‌సభలో అటూఇటూగా ఎక్కువ ఉద్రిక్తత వాతావరణం లేకపోయినాగానీ, రాజ్యసభ అందుకు పూర్తిభిన్నంగా ఉంది. ప్రతిపక్షనాయకుడు మల్లికార్జునఖర్గే,డెరెక్ ఓ బ్రెయిన్‌లు పదే పదే పెట్రోలు,డీజిలు ధరల పెరుగుదల సమస్యను ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. బిజెపికి చెందిన కిరిత్ సోమైయాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన అంశాన్ని ప్రస్తావించడానికి శివసేన సభ్యుడు సంజయ్ రౌత్, ప్రియాంకా చతుర్వేది విఫలయత్నం చేశారు. అయినా సభాపతి తిరస్కరించి శూన్యగంట కార్యకలాపాలను చేపట్టారు. దాంతో ప్రతిపక్షాలు సభ మధ్యలోకి దూసుకువచ్చాయి. బాధ్యతాయుతమైన ఎగువసభలో ప్రజా సమస్యలపై చర్చలు ఫలవంతంగా జరగకపోవడంపట్ల ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదే పదే ప్రతిరోజూ విజ్ఞప్తి చేసినాగానీ సభాపతి ఎం.వెంకయ్యనాయుడు పెట్రోలు, డీజిలుధరల పెరుగుదలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష సభ్యులను తిరస్కరించారని, అతిముఖ్యమైన ధరల పెరుగుదల సమస్యపై చర్చకు అవకాశం లేకుండా చేశారని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. సభ సమావేశామైన ఏ ఒక్కరోజునా కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.కార్మిక సమస్యల గురించి, నిరుద్యోగం గురించి కూడా ప్రభుత్వం చర్చకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి తిరస్కరించారు. పార్లమెంటు సమావేశాలు రెండు నెలల కాల వ్యవధిలో 27 రోజులు పార్లమెంటు సమావేశమైంది. పలు సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా రెండోవిడత బడ్జెట్ సమావేశాల్లో పెట్రోలు,డీజిలు ధరల పెరుగుదలపై నిర్మాణాత్మకమైన చర్చ చేసేందుకు ప్రతిపక్షాలు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నం విజయంవంతం కాలేదు. ఉభయసభల్లో సభాపతులు నిర్దంద్వంగా ప్రతిపక్షాల విజ్ఞప్తులను తోసిపుచ్చారు. రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు, నిర్దంద్వంగా వ్యవహరించారు. ధరలు పెరుగుతాయి, కానీ ప్రభుత్వం మాత్రం చర్చించడానికి సుముఖంగా లేదని స్పష్టం చేశారు.
ఇదీ సమావేశాల తీరు..
జనవరి 31వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 11వ తేదీన మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మార్చి 14వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 7వ తేదీన ముగిశాయి. నిర్ణీత కాలానికి ఒకరోజు ముందే సమావేశాలను ముగించారు.ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసిడ్యూర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు , అకౌంటెన్సీ బిల్లు వంటి కీలకబిల్లులను పార్లమెంటు ఆమోదించింది. లోక్‌సభ 12 బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ 11 బిల్లులను ఆమోదించింది. లోక్‌సభ స్వల్పకాల చర్చకింద వాతావరణ మార్పులపై,ఉక్రేన్ సమస్య, క్రీడలకు ప్రోత్సాహం పై చర్చించింది. 17వ లోక్‌సభ ఎనిమిదవ సమావేశాల్లో 129 శాతం మేరకు ఉత్పాదకత లభించిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. సభ 27 సమావేశాలు నిర్వహించిందని చెప్పారు. అదేవిధంగా సభ్యులు జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై ఆలస్యమైనాగానీ 40 గంటలు అదనంగా వెచ్చించారన్నారు. కాగా రాజ్యసభ పనితీరుపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సభలో ఉద్రిక్తతలు,వాయిదాలు, ఆటంకాలవల్ల రాజ్యసభ 9.46 గంటల సమయం కోల్పోయిందని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో 99.8 శాతం ఉత్పాదకతను సభ సాధించిందన్నారు. సభ గనుక మరో 10 నిమిషాలు అదనంగా పనిచేసి ఉంటే నూటికి నూరుశాతం ఉత్పాదకత నమోదై ఉండేదన్నారు.