త్వరలో ‘ధరణి ఫైల్స్’ విడుదల
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ ‘ధరణి వెనుక పెద్ద మాఫియా దాగుందని, దానికి సంబంధించి త్వరలో ‘ధరణి ఫైల్స్’ను విడుదల చేస్తామని, ఆధారాలతో సహా ధరణిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందని, ధరణిలో పెట్టుబడిదారులు
ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాలు విసిరారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. మంత్రి కెటిఆర్ సన్నిహితులకు సంబంధాలు ఉన్నాయని, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని, అన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు అని, ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారని అన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానంటే కెసిఆర్ భయపడుతున్నారని, అందుకే ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకువస్తామని, కెసిఆర్ భూ అక్రమాలను కూడా బయటపెడతామని చెప్పారు. . ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని, కేంద్రం తలచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలను బహిర్గతం చేయవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈటలను మోసం చేసిన బిజెపి
ఇటీవల మంత్రి కెటిఆర్ ఢిల్లీ పర్యటనతో బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపామని తెలిపారు. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈటల రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారని, రాజేందర్ ను బిజెపి మోసం చేసిందన్నారు.. రాజేందర్ కు భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు? నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం…రాజేందర్ అన్నకు భద్రత ఏర్పాటు చేయడం సంతోషమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
120 రోజులు ఇంటికి సెలవు పెట్టండి
ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లేనని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని, వచ్చే 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టిపిసిసి ఎస్‌సి విభాగం ఆధ్వర్యంలో ఇందిరాభవన్‌లో జరిగిన ఎల్.డి.ఎమ్.. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ధరణి’ వెనుక పెద్ద మాఫియా
RELATED ARTICLES