సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరెట్‌ల ఎదుట నిరసన
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణం
భారీ పోలీసు వలయంలో నిరసన… ధర్నా…
ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో లొసుగులను సరిచేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ధరణి పోర్టల్‌లో వున్న లోపాలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను సంరక్షించి పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం అన్ని కలెక్టరేట్‌ల ఎదుట నిరసన, ధర్నాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన, ధర్నాకు వందలాది మంది హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి చాడ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని సవరణలతో తీసుకువచ్చిన రెవెన్యూ చట్టం, రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ధరణి పోర్టల్‌లో వున్న లోపాలు, లొసుగుల కారణంగా రైతులకు భూమిపై ఉన్న హక్కులు కోల్పోయే పరిస్థితి నెలకొందని చాడ విమర్శించారు. సంవత్సరాల కాలంగా తహసీల్దార్ ,ఆర్‌డిఒ జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకు పరిష్కారం దొరకక అనేకమంది రైతులు నిరాశా, నిస్పృహలకు లోనవుతూ, ప్రభుత్వం అందిస్తోన్న రైతుబంధు సహాయం అందక అనేక మంది చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చాడ చెప్పారు. గ్రామస్థాయిలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించకుండా తహసీల్దార్, ఆర్‌డిఒలకు ఎలాంటి అధికారులు లేకుండా చేసి, జిల్లా కలెక్టర్లకే పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టడంతో ఆచరణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నంబర్ 41/14లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని గత 70 సంవత్సరాలుగా నిరుపేద రైతు సయ్యద్ బాబూ జానీ సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, ఆయన పొలాల్లో రెవెన్యూ అధికారులు జెసిబిలతో అర్ధరాత్రి ధ్వంసం చేసి ఆక్రమించుకున్న భూమిని వెంటనే ఆ రైతుకు అప్పగించాలని, ఖానామెట్, పుప్పాలగూడలో ప్రభుత్వ భూముల వేలంను వెంటనే నిలిపివేసి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని చాడ వెంకడ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 774లో ఉన్న 4.20 ఎకరాల్లో గత అరవై సంవత్సరాలుగా రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తోన్న వడ్డెరలకు ఆ భూమిని కేటాయించాలని, మహేశ్వరం మండలం గంగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 85లో గత 60 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న రైతుల భూమిని ఆన్‌లైన్ చేయాలని, కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేయాలని తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. షాబాద్, చేవెళ్ల, తుర్కయంజాల్, మొయినాబాద్ మండలాల్లో ప్రభుత్వ భూములను సంరక్షించాలని ఆయన డ-డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్న ప్రజలు, నిరుద్యోగులు ,నిరుపేదలు ఉద్యోగాలు రాక, ఉపాధి లేక అన్నమో రామచంద్రా అని అలమటించే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న నిరుపేద రైతులకు అప్పగించేంతవరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. భూదాన్, ప్రభుత్వ భూముల కాపాడాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు. నిరుపేదలకు భూములు, ప్లాట్లు పంచిన ఘన చరిత్ర సిపిఐకి ఉందని, ఎర్ర జెండా ఎప్పుడూ పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఆయా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సీనియర్ నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు, రాష్ట్ర సమితి సభ్యులు కావాలి నర్సింహా, సయ్యద్ అఫ్సర్, పానుగంటి పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, కె.రామస్వామి, ఎం.ప్రభులింగం, షమీదా భేగం, ఎఐటియుసి జిల్లా నాయకులు దత్తు నాయక్, జైపాల్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శులు సామిడి శేఖర్ రెడ్డి, కె.శ్రీనివాస్, నర్రా గిరి, ఎం.శ్రీనివాస్ నాయక్, సుధాకర్‌గౌడ, సుధీర్, షకిల్, ఎన్. జంగయ్య, టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘ధరణి’ లొసుగులు సరిచేయకుంటే.. ప్రభుత్వంపై తిరుగుబాటు
RELATED ARTICLES