HomeNewsTelangana‘ధరణి’ ఓ కుట్ర

‘ధరణి’ ఓ కుట్ర

నాటి సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భూకుంభకోణం : కోదండరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కుట్ర పూరితంగానే మాజీ సిఎం కెసిఆర్‌ ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భూ కుంభకోణం జరిగిందన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద కుంభం కోణం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిందని కోదంద రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకతవకలపై మొత్తం కెసిఆర్‌, కెటిఆర్‌లే భాగస్వాములన్నారు. రెవెన్యూ శాఖ కెసిఆర్‌ దగ్గర ఉందని, ఐటి శాఖ కెటిఆర్‌ దగ్గర ఉందని, కుంభకోణాలకు మొత్తం
కెసిఆర్‌, కెటిఆర్‌లే బాధ్యులని విమర్శించారు. కెసిఆర్‌, కెటిఆర్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 22ఎ ను ఆధారంగా చేసుకొని భూ కుంభకోణానికి పాల్పడిందన్నారు. షామీర్‌ పేట మండలం తూముకుంట గ్రామంలో 164/1 సర్వే నెంబర్‌లో 26 ఎకరాల అటవీ భూమి జూన్‌ 2022న ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారని తెలిపారు. సర్వే నెంబర్‌ 260/2, 261, 265/8 361/7 361/9 రక్షణ శాఖ భూమిని బాలాజీ అసోసియేట్స్‌ అనే సంస్థకు కట్టబెట్టారని చెప్పారు. బొంరాస్‌ పెట్‌ గ్రామంలో 1065 ఎకరాల ప్రైవేట్‌ భూమి అసలైన రైతులకు దక్కకుండా, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుటుంబానికి చెందిన ఎఫ్‌ 4 ఎల్‌ ఫారమ్స్‌కు ధారాదత్తం చేశారన్నారు. రాజ్యసభ సభ్యడు సంతోష్‌ 23 ఎకరాల నిషేధిత భూమిని రిజర్వు చేసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం వేల ఎకరాల రైతుల భూములను పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టి, ఎన్నికలు అవ్వవగానే అంబూజ్‌ అగర్వాల్‌ పేరున రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. 24 లక్షల అసైన్డ్‌ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి, వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. హెచ్‌ఎండిఏను అడ్డుపెట్టుకొని, పేదల భూమిని లాక్కొని వేలం వేశారన్నారు. చేవెళ్ల మండలం చందవేల్లిలో15 వందల ఎకరాలు దళితులు, రైతుల దగ్గర లాక్కొని, ఎకరాకు తొమ్మిది లక్షల చెల్లించారన్నారు. కెటిఆర్‌ తనకు అనుకూలంగా ఉన్న మల్టీ నేషనల్‌ కంపనీకి రూ.1 కోటి 30 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. అన్ని సమగ్ర ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిస్తున్నా అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తాము అప్పటి ప్రభుత్వానికి వీటిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. మాజిల్‌పూర్‌ గ్రామంలో ఆనాడు ల్యాండ్‌ సీలింగ్‌లో పోయిందని, 25ఎకరాల భూమిని పట్టా చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేదల కోసం పాటుబడే పార్టీ అన్నారు. అక్రమాలను అన్ని బయట పెట్టి, ప్రభుత్వానికి నివేదిస్తా అన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయంతో ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్‌, కెటిఆర్‌లపై చర్యలు తీసుకోవాలని కోదండ రెడ్డి కోరారు. ధరణి అనేది భూమిని కాజేయడానికి అని సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి చెప్పారని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలు జరగగానే, ఎంత పెద్ద వారైనా వదలొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డిని కోదండ రెడ్డి కోరారు. రెవిన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments