ఆస్తుల పత్రాలు అడుగుతుండడంతో జనం పరేషాన్
సర్వేలో అస్పష్టత : సిబ్బందిపై ప్రశ్నల వర్షం
గ్రేటర్ హైదరాబాద్‌లో ముందుకు సాగని సర్వే
మొత్తం ఆస్తులు 24 లక్షలు
కేవలం 2.40 లక్షల పైచిలుకు పూర్తి
ప్రజాపక్షం/హైదరాబాద్
కరోనా వైరస్ విజృంభిస్తుంటే… ధరణి ఆన్‌లైన్ ఆస్తుల సర్వే ఏంటి… మాకు సర్వే వద్దు గిర్వే వద్దు.. పోపో.. అంటూ సిబ్బందిని బయటి నుంచి బయటే తిప్పి పంపిస్తున్నారు. మీరు ఎక్కడెక్కడో తిరిగి… మాకు కరోనా వైరస్ అంటిస్తారా? అం టూ సర్వేకు నిరాకరిస్తున్నారు. ఇక సినియర్ సిటీజన్‌లు అయితే డోర్‌లు కూడా తెరవని పరిస్థితులు నెలకొన్నాయి. అనేక అనుమనాల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో సర్వే ముందుకు సాగని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి ఆన్‌లైన్ ఆ స్తుల సర్వేకు శనివారం నాటికి కేవలం 10 శాతం వరకే పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారుల అంచనా ప్రకారం మొత్తం 24 లక్షల వరకు ఆస్తులు ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 2.40 లక్షల పైచిలుకు మాత్రమే సర్వే పూర్తి చేశారని విశ్వసనీయ సమాచారం. సర్వేకు నగర ప్రజల స్పందన లభించకపోవడంతో ముందుకు సాగడం లేదు. ధరణి ఆన్‌లైన్ ఆస్తుల సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈనెల 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ సర్వేను చేపట్టిన విషయం తెల్సిందే. ఈనెల 15వ లోపు ఆస్తులన్నీ ఆన్‌లైన్‌లోకి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. తుది గడువు సమీపిస్తున్నా 10 శాతం వరకు మాత్రమే ఆస్తుల వివరాలు సేకరించగలిగారు. అనేక సవాళ్ల మధ్య కొనసాగుతున్న సర్వే పూర్తవుతుందా? లేక మధ్యలోనే ఆగిపోతుందా ? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరంలో ఇంత గడువులోపు సర్వే పూర్తి చేయడం గగనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సర్వే ప్రయోజనాలపై స్పష్టత కరువు…
ధరణి ఆన్‌లైన్ ఆస్తుల సర్వే నిర్వహణపై స్పష్టత లేకుండా పోయింది. సర్వేను ఎందుకు చేపట్టారని, దానివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయంపై ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని కొంత మంది అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారనే అంశంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావసనంగా సర్వేకు ప్రజల నుంచి సహకారం అందకుండా పోతోంది. ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఇస్తే దుర్వినియోగం చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొంతమంది నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆస్తి పన్ను, తాగునీటి, విద్యుత్, ట్రేడ్ లైసెన్స్ బిల్లులు, కమర్షియల్ ట్యాక్స్ లాంటివి క్రమంగా చెల్లిస్తున్నామని, వాటిలో తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఉంటాయని, ధరణి ఆన్‌లైన్ ఆస్తుల సర్వే పేరిట మరోసారి ఎందుకు తమ ఆస్తుల వివరాలు ఇవ్వాలని సర్వేకు వెళ్లిన అధికారులు, సిబ్బంది ఎదుట సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తుల వివరాలను ఇస్తే దుర్వినియోగానికి పాల్పడితే ఎవ్వరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాలకు సంబంధించి సరైన సమాధానాలు ఇవ్వలేక సర్వే సిబ్బంది వెనక్కు వస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్తుల సర్వే చేసే యాప్ సర్వర్ వేగంగా పని చేయకపోవడంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా వస్తున్నాయి. సర్వేకు వెళ్తున్న సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్ర స్థాయిలో తలెత్తే సందేహాలు, సమస్యల నివృత్తికి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో సర్వే ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. జిహెచ్‌ఎంసి ఆస్తిపన్ను లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 14 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నాయి. అయితే జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 24 లక్షల వరకు ఆస్తులు ఉంటాయని అధికారులు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే ఆస్తుల సర్వే జరగడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ఆధార్‌కార్డులు ఇవ్వాల్సిందే…
ధరణి ఆన్‌లైన్ ఆస్తుల సర్వేకు సంబంధించి ఆధార్‌కార్డు ఇవ్వాలని సర్వే సిబ్బంది అడుగుతున్నారు. ఆధార్ కార్డు నెంబర్ యాప్‌లో ఫీడ్ చేయని పక్షంలో అప్లికేషన్ అప్‌లోడ్ కావడం లేదని కొంతమంది సిబ్బంది వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలామందికి వారసత్వంగా వచ్చిన ఆస్తులను అనేక కారణాల దృష్ట్యా రిజిస్ట్రేషన్ చేసుకోలేపోయారు. వారి తాతలు, తల్లితండ్రులు చనిపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఆధార్‌కార్డులు లేకపోవడంతో వారి ఆస్తులను ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేయలేకపోతున్నారు. ఆధార్ కార్డులు ఉన్న వారసులు సైతం అయోమయం.. గందరగోళానికి గురవుతున్నారు. కొంతమంది అయితే తాతలు, అమ్మమ్మలు, నానమ్మల పేర్లపై ఆస్తులు ఉన్నాయి. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను తమ పేరుపై ఆన్‌లైన్ నమోదు చేయాలని వారుసులు కొరుతున్నారు. ఆధార్ కార్డు నెంబర్ లేని పక్షంలో అప్‌లోడ్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సాంకేతిక పరమైన సమస్యలకు ఉన్నతాధికారులు పరిష్కారమార్గాలు చూపకపోవడంతో క్షేత్రస్థాయిలో సర్వేలో సందిగ్దత నెలకొంది. సర్వేకు వెళ్లిన క్షేత్ర స్థాయి సిబ్బంది ఇలాంటి వాటిపై సరిగ్గా అవగాహన లేకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల మరణించిన వారి ఆధార్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేద్దామంటే వారి ఫోన్‌కు ఓటిపి వస్తుంది. ప్రస్తుతం మరణించిన వారి ఫోన్ వాడుకలో లేకపోవడంతో ఆస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. కొంతమంది వారసులు తమకు తాము ఆస్తులను పంచుకొని, వాటిలో నిర్మాణాలు చేసుకున్నారు. ఆస్తులను నోటిమాటగా పంచుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్‌ను చేసుకోలేకపోయారు. ఇలాంటి వారి ఆస్తులు నమోదు చేయడం లేదని తెలిసింది. చనిపోయిన వారి వారసుల పేర్లు నమోదు చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఇక వివాదాస్పద భూములు, ఆస్తుల వాటాల పంపకంలో వారసుల మధ్య వివాదాలుంటే వాటి విషయంలో కూడా నిర్థిష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో నిజమైన యజమానులు నష్టపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే నిర్వహణకు సులువైన మార్గదర్శకాల నిర్దేశిస్తే తప్ప ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
‘ధరణి’తో దడ!
RELATED ARTICLES