రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవలసిన అవసరాన్ని వక్కాణిస్తూ 22 రాష్ట్రాలకు చెందిన భిన్న నేపథ్యాలు కలిగిన 100 మంది మహిళలు ఐదు యాత్రా దళాలుగా దేశా న్ని చుట్టివచ్చి చరిత్ర సృష్టించారు. కన్యా కుమారి, కశ్మీర్, కేరళ, జోర్హాట్, ఢిల్లీలనుంచి సెప్టెంబర్ 22న బయలుదేరిన యాత్రాదళాలు అక్టోబర్ 13న ఢిల్లీ చేరుకున్నాయి. ఈ కాలంలో వారు వేలాదిమంది ప్రజలతో సంభాషించారు. 200 నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విద్యార్థులు, యువ జనులు, మహిళలు, రైతులను, సాధారణ ప్రజలను కలుసుకున్నారు. 600లకు పైగా బహిరంగసభలు, హాలు సమావేశాలు నిర్వహిం చారు. వారు మొత్తంగా దేశానికి తప్ప తమకుగా ఏమీ కోరటం లేదు.
దేశంలో పెరుగుతున్న హింసపట్ల వారు కలత చెందారు. దేశవ్యాప్తంగా ద్వేషవాతావరణం, అసమ్మతిపై దాడులు, దళితులు, మైనారిటీలను మరింతగా అణగదొక్కటం, మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు, విద్యాసంస్థలపై దాడులు వారిని ఆందోళనకు గురిచేశాయి. మన ఉమ్మడి వారసత్వానికి, బహుళతకు, భిన్నత్వానికి ఎదురవు తున్న ముప్పును వారు గుర్తించారు. ఉమ్మడి పౌరసత్వాన్ని, సమష్టి చైతన్యాన్ని మాత్రమేగాక భారతదేశం అనే భావనను రక్షించుకోవటానికై ఎన్.ఎఫ్.ఐ.డబ్లు(భారత జాతీయ మహిళా సమాఖ్య), అన్హద్, ఇంకా అనేక మహిళా సంఘా లు, గ్రూపులు ఒక్కటిగా ‘బాతె అమన్ కీ’ (శాంతి గూర్చి మాట్లాడదాం) అనే బ్యానర్ కింద ఈ అపూర్వమైన యాత్రా కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ భావన అనగా మనదేశ అపారమైన సాంస్కృతిక భిన్నత్వాన్ని, విశ్వాసాలను, భాషల ను, ప్రజలను, సముదాయాలను గుర్తించటం, గౌరవించటం. రాజ్యాంగ భావన, పౌరసత్వ విలువలతో అందర్నీ కలిసికట్టుగా ఉంచటం. అదే ప్రజాస్వామ్యానికి కొలబద్ద. మరింత ప్రజాస్వామ్య యుత, లౌకిక, సమానత్వ సమాజంగా ముందుకు ప్రయాణించటంలో భారతదేశం అనేక ఆచారాలు, ఆచరణలను (అవి మతపరమైనవి, ఇతరత్రా కూడా) సాహసంతో విడనాడింది.
భారతదేశం గూర్చిన ఈ భావన తీవ్ర మైన ప్రమాదంలో ఉందని దేశంలోని మహిళలు బలం గా అభిప్రాయపడుతున్నారు. ఆలోచన, వ్యక్తీకరణ అవకాశాలన్నింటినీ విచ్ఛిన్నశక్తులు కలుషితం చేశాయి. ఏహ్యత, భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తు న్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థల ద్వారానైతే సామాన్య పౌరుడు తన ఆకాంక్షలను వ్యక్తం చేస్తాడో, తన కలలను నెరవేర్చుకుంటాడో ఆ ప్రజాస్వామిక సంస్థలన్నీ తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. విద్వేష శక్తులపట్ల మనం ఉదాసీనంగా ఉండలేము. అవి మన గడ్డపై పెరిగేందుకు, భారత ఉపఖండాన్ని ఏహ్యకా సారంగా మార్చేందుకు, మతతత్వ రాజ్యస్థాపన దిశగా ప్రయాణించేందుకు అనుమతించకూడదు. మోడీ ప్రభుత్వ కాలంలో రాజ్యాంగంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై బరి తెగించిన దాడి జరుగుతోంది. ఫ్యూడల్, ఫాసిస్టు శక్తులు మన జీవితం లోని అన్ని పార్శాల్లోకి చొరబడి మనం ఏమి తినాలో, తాగాలో, చదవాలో, రాయాలో, ధరించాలో, ఏ సినిమా చూడాలో, మనం ఎవరితో స్నేహం చేయాలో, ఎవర్ని వివాహమాడాలో, ఏ వృత్తిని చేబట్టాలో, స్త్రీ ఎంతమంది పిల్లల్ని కనాలో ఆదేశిస్తున్నప్పుడు స్వాతంత్య్రోద్యమంలో పురుషు లతో భుజం భుజం కలిపి పోరాడిన ఈ దేశ మహిళలు నిష్క్రియాపరంగా ఉండజాలరు.
చట్టబద్ధపాలన, సమానత్వంపట్ల రాజ్యాంగ ప్రాథమిక నిబద్ధత నిలకడగా క్షీణించటాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారికి, వాటితో విబేధించేవారికి దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. పాశవిక కృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని ప్రత్యర్థులుగా ముద్రవేస్తున్నారు. న్యాయం కొరకు నిలబడి, పోరాడేవారిని ‘మావోయిస్టు, అర్బన్ నక్సలైట్’గా ముద్రవేస్తు న్నారు. మానభంగ నేరాలచుట్టూ రాజకీయ, మత చర్చ తెస్తున్నారు. మానభంగం, హత్య, మూకదాడి నేరస్థులకు మద్దతుగా జాతీయ పతాకాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి ఏ మాత్రం అంగీకార యోగ్యంకాదు, తిప్పికొట్టాలి.
సమాజంలో హింసపెరగటం మహిళల జీవితా లపై గాఢమైన ప్రభావం చూపుతోంది. గత నాలు గేళ్లలో మహిళల స్థితి గణనీయంగా క్షీణించింది. మతాన్ని రాజకీయం చేయటం, మతాన్ని రాజకీయాల్లోకి తేవటం ఇందుకు ప్రధాన కారణం. నైతిక విలువలు నిర్ణయించటంలో, సమాజంలో మహిళల పాత్రను ఆదేశించటంలో హిందూమత వాద సంస్థలు నాయకత్వ పాత్ర వహిస్తున్నాయి. దీనికి బిజెపి పరోక్ష, ప్రత్యక్ష మద్దతుంది. స్వయం ప్రకటిత గోరక్షకులు సాగిస్తున్న మూకహత్యలు, పరువు హత్యలు వగైరా నిత్యకృత్య మైనాయి. ముస్లింలు, దళితులు, క్రైస్తవులపై దాడులు భయం, అభద్రత వాతావరణం సృష్టిస్తున్నాయి. వీటికి తోడు నయా ఉదార ఆర్థిక విధానాలు స్థూలంగా భారత మహిళలపై, ముఖ్యంగా దళితులు, ఆదివాసీల జీవితాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
దీర్ఘకాలంపాటు మహిళా ఉద్యమాలవల్ల సాధిం చుకున్న పురోగతి వెనక్కు నెట్టబడుతున్నది. అశాస్త్రీయ ఆలోచన ప్రోత్సహించబడుతున్నది. ఈ దేశ ప్రధాని చాందసభావాలకు, మూఢనమ్మ కాలతో కూడిన మత విశ్వాసాలకు నాయకత్వం వహిస్తున్నారు. దేశ జనాభాలో 50శాతంగా ఉన్న మహిళలు బలమైన శక్తి. గత శతాబ్దకాలంలో మహిళా ఉద్యమాలు సాధించుకున్న విజయాలను కాపాడు కునేందుకు, అవి కోతకు గురికాకుండా అడ్డుకునేం దుకు దేశంలోని మహిళలతోపాటు అన్ని ప్రగతి శీల, ప్రజాస్వామ్యశక్తులు కలిసికట్టు గా ముందుకు రావాలి.
ప్రధానమైన మహిళా సంఘం గా ఎన్.ఎఫ్.ఐ. డబ్లు ఈ యాత్రల్లో క్రియాశీలంగా పాల్గొన్నది. సంఘం జాతీయ కార్యదర్శులు నిషా సిద్దూ, కన్వల్ ధిల్లాన్ కన్యాకుమారి, కశ్మీర్ యాత్రలకు వరుసగా నాయకత్వం వహించారు. యువమహిళా విభాగం క్రియాశీలంగా పాల్గొంది. 18మంది ఎన్.ఎఫ్.ఐ. డబ్లు.సభ్యులు యాత్ర పూర్తికాలం పాల్గొన్నారు.
అధ్యక్షురాలు అరుణా రాయ్, ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా వివిధ రాష్ట్రాల్లో బహి రంగసభల్లో పాల్గొన్నారు. సిపిఐ, ఎఐటియుసి ప్రతిరాష్ట్రశాఖ పూర్తి సహాయ సహకారాలు అందిం చాయి. ఈ యాత్రల తక్షణ ఫలితం నిర్భయంగా మాట్లాడేందుకు అదిమహిళలకు గళ మిచ్చింది. మనదేశాన్ని ప్రజాస్వామిక, లౌకిక దేశంగా కాపాడుకునేందుకు దేశం పోరాడ గలదన్న ఆత్మవిశ్వాసం నింపింది.
-అన్నీ రాజా