హీరా గ్రూప్ సంస్థ నిర్వాకం
‘ప్రజాపక్షం’కు చిక్కిన ఆడియో సంభాషణ
సీజ్ చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులు
అయోమయంలో బాధితులు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : లక్షలాది మంది డిపాజిట్‌దారులను మోసగించి, వేల కోట్ల రూపాయలను దోచుకున్న హీరా గ్రూప్ సంస్థ తన ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసుకుంటుంది. విషయం తెలిసి కూడా పోలీసులు చోద్యం చూడడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాసాబ్‌ట్యాంక్ ఆఫియా ప్లాజాలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా 15 ఏళ్ల నుంచి నడుస్తున్న హీరాగ్రూప్ సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి పలు రాష్ట్రాలతో పాటు విదేశాలలో ఉన్న సుమారు మూడు లక్షల మంది నుంచి రూ.50వేల కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ చైర్మన్ నౌహీరా షేక్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, కోల్‌కత్త, ఢిల్లీలో 20కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం నిందితురాలు చిత్తూరు జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంది. తనపై కేసుల సంఖ్య పెరగడంతో పాటు పోలీసు దర్యాప్తులో తనకు ఉచ్చు బిగిస్తుందని భావించిన నిందితురాలు తన ఆస్తులను ఒక్కొక్కటిగా గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసుకోడానికి స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే మాసాబ్‌ట్యాంక్‌లోని హీరా గ్రూప్ సం స్థ పేరుతో ఉన్న ఆఫియా ప్లాజా భవనాన్ని విక్రయించేందుకు మూడు రోజుల నుంచి బేరాసారాలు కొనసాగిస్తున్నారు. అందుకు సంబంధించిన సంభాషణ ఆడియో ‘ప్రజాపక్షం’ చేతికి చిక్కింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ట్రావెల్ ఏజెంట్ కార్యాలయం నిర్వాహకులు హీరా గ్రూప్ సంస్థ ఆస్తులను విక్రయించేందుకు రంగంలోకి దిగారు. ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బును బినామీ పేర్లపై డిపాజిట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో పోలీసుల రికవరీ నుంచి తప్పించుకోవచ్చనేది నిందితుల పథకం. దీన్ని అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు, రౌడీషీటర్లు, ట్రావెల్స్ ఏజెంట్ నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. హీరాగ్రూప్ సంస్థపై కేసు నమోదైన తేదీకి అంతకుముందు తేదీలలో ఈ భవనం ఇతరులకు విక్రయించినట్లుగా రిజిస్టార్ పేపర్లపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పలు స్టేషన్‌లతోపాటు సిసిఎస్‌లో సైతం హీరాగ్రూప్ సంస్థపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.